సంక్షోభాలను అవకాశాలుగా మల్చుకోవాలని చంద్రబాబు అంటూ ఉంటారు. లోకేష్ కూడా అదే పాటిస్తున్నారు. అయితే ఇక్కడ కాస్త డిఫరెంట్ .. సంక్షోభాలు పక్క రాష్ట్రానివి.. అవకాశాలు ఆంధ్రవి అన్నట్లుగా మార్చేసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఎయిర్ పోర్టు వద్ద ఎరో స్పేస్ పార్క్ నిర్మాణం కోసం పదిహేడు వందల ఎకరాల్ని సేకరించాలనుకుంది. కానీ దేవనహళ్లిలో రైతులు తిరగబడ్డారు. దాంతో ప్రభుత్వం భూసేకరణను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఏరోస్పేస్ పార్క్ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.
ఈ విషయంలో బిజినెస్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. వెంటనే నారా లోకేష్ స్పందించారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో ఏరోస్పేస్ ఇండస్ట్రీ కోసం తన వద్ద మంచి ఆలోచన ఉందన్నారు. మీ కోసం మా వద్ద ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉంది, అత్యుత్తమ ప్రోత్సాహకాలు అలాగే 8000 ఎకరాలకు పైగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న భూమి ఉందన్నారు. అది కూడా బెంగళూరుకు సమీపంలోనే ఉందన్నారు. త్వరలోనే కలుద్దామని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం.. అనంతపురం సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు సిటీకి వెళ్లేంత దూరం కన్నా.. ఇంకా తక్కువ దూరమే ఉంటుంది. కియా పరిశ్రమ వద్దకు బెంగళూరు సిటీ బస్సులు నడుస్తూంటాయి. అంత దగ్గరగా మారిపోయింది. అందుకే నారా లోకేష్ పిలుపునకు ఏరో స్పేస్ ఇండస్ట్రీ కి చెందిన వారు స్పందిస్తే.. అనంతపురంకు అడ్వాంటేజ్ అవుతుంది.