తనపై కుట్ర జరుగుతోందనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్, ఆయన స్నేహితులూ కలిసి… సచివాలయంలోనే ప్రణాళికలు వేసి అమలు చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇది శ్రీరెడ్డి వివాదం నేపథ్యంలో లోకేష్ పై చేసిన ఆరోపణ. కొద్దిరోజుల కిందట… గుంటూరులో పార్టీ ఆవిర్భావ సభలో కూడా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిపై మంత్రి లోకేష్ తాజాగా స్పందించారు.
గడచిన ఎనిమిదేళ్లుగా తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తూనే ఉన్నామనీ, ఇంత పారదర్శకంగా వేరే ఎవ్వరూ చేయడం లేదని లోకేష్ అన్నారు. తాము ప్రకటించిన ఆస్తుల కంటే చిల్లి గవ్వ ఎక్కువ ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తే కేసుల పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు! అంతకుమించి ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే మొత్తం ఆస్తులు రాసివ్వడానికైనా తాము సిద్ధమే అన్నారు. శ్రీరెడ్డి వివాదంలో కూడా పవన్ కల్యాణ్ తన పేరును ప్రస్థావించి ఆరోపించారన్నారు. నిజానికి, క్యాస్టింగ్ కౌచ్ మీద ఆమె పోరాటం చేస్తోందనీ, ఆమె పవన్ ని విమర్శిస్తే.. ఆ క్రమంలో ఆయన స్పందిస్తూ తామేదో కుట్ర చేస్తున్నామని అనడం నిరాధారమన్నారు. తాము ఎల్లప్పుడూ పాజిటివ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తామన్నారు. వ్యక్తిగతంగా తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా గౌరవం ఉంటుందన్నారు. అయితే, కొంతమంది ఆయనని కలుషితం చేస్తున్నారనీ, కొందరి ప్రభావం పవన్ మీద పడిందని లోకేష్ అనడం విశేషం.
తాజా వివాదం నేపథ్యంలో టీడీపీని లక్ష్యంగా చేసుకుని పవన్ చాలా తీవ్ర ఆరోపణలే చేస్తున్నారు. కానీ, ఆ పార్టీ నుంచి నేతలెవ్వరూ స్పందించడం లేదు. టీడీపీతో సఖ్యతగా ఉన్న సమయంలో కూడా.. పవన్ ఏదైనా విమర్శ చేస్తే కనీసం కొందరైనా కౌంటర్ ఇచ్చేవారు. ప్రస్తుతం అలా కూడా స్పందించడం లేదు. ఓరకంగా పూర్తి సంయమనం పాటిస్తున్నట్టే చెప్పుకోవాలి. పవన్ తమను ఎన్ని అంటున్నా… తాము ఆయన్ని గౌరవిస్తున్నామనీ, ఎప్పటికీ గౌరవిస్తామనే సంకేతాలే మంత్రి నారా లోకేష్ ఇస్తున్నారు. మొన్ననే, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇలానే స్పందించారు.