తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పార్టీ బలోపేతం దిశగా సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు, క్యాడర్‌కు మరింత చేరువయ్యేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ప్రతిరోజూ ఏడుగురు ఎమ్మెల్యేలతో డిన్నర్ మీటింగ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. కేవలం రాజకీయ చర్చలకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో ఈ సమావేశాలు జరిగేలా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేశారు.
కలుపుగోలుగా మాట్లాడుకునేలా డిన్నర్ మీటింగ్‌లు
ఈ మీటింగ్‌ల వల్ల ఎమ్మెల్యేల మధ్య అనుబంధాలు పెరగడమే కాకుండా, వారి వ్యక్తిగత యోగక్షేమాలను అడిగి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. రోజుకు ఏడుగురు చొప్పున ఒక్కో జిల్లా ఎమ్మెల్యేలతో లోకేష్ ముఖాముఖి భేటీ అవుతున్నారు. నేతలకు ఉన్న ఇబ్బందులు, వారి నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై వివరాలు తెలుసుకుని సమస్యల పరిష్కారానికి లోకేష్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ భేటీల్లో నియోజకవర్గాల అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న సమస్యలపై లోకేష్ వివరాలు తెలుసుకుంటారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.
మొదటి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిపై ప్రత్యేక దృష్టి
మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఇంకా సర్దుకోలేకపోతున్నారని.. వారే ఎక్కువగా తప్పులు చేస్తున్నారని నివేదికలు పార్టీకి అందుతున్నాయి. వారిని దారిలో పెట్టడానికి నారా లోకేష్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే అది గదమాయించడం.. హెచ్చరించడం ద్వారా కాకుండా.. మంచిగా చెప్పడం ద్వారా చేయాలనుకుంటున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి పాలనపై అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన గైడెన్స్ ఇవ్వనున్నారు. ఈ పద్ధతి వల్ల ఎమ్మెల్యేలలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. హైకమాండ్ తో ఏమైనా గ్యాప్ ఉంటే తగ్గుతుంది.
నేతలతో ఎమోషనల్ టచ్
సాధారణంగా నాయకులు కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించడం పరిపాటి. కానీ లోకేష్ ఇలా డిన్నర్ మీటింగ్స్ నిర్వహించడం ద్వారా నేతలకు మరింత ఆత్మీయుడిగా మారుతున్నారు. నేతలతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పడటం వల్ల పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని భావిస్తున్నారు. లోకేష్ అనుసరిస్తున్న ఈ సరికొత్త వ్యూహం వల్ల కేడర్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. సాంకేతికతను వాడుకుంటూనే క్షేత్రస్థాయిలో మనుషులతో మమేకమవ్వడం లోకేష్ స్టైల్. అటు డాష్ బోర్డుల ద్వారా అభివృద్ధిని పర్యవేక్షిస్తూనే, ఇటు ఇలాంటి భేటీల ద్వారా నేతల మనసు గెలుచుకుంటున్నారు. పార్టీలో సీనియర్లకు గౌరవం ఇస్తూనే, యువ నేతలను ప్రోత్సహిస్తూ లోకేష్ తన నాయకత్వ ముద్రను చాటుకుంటున్నారు.
