సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేషం, చిన్నారులపై దాని దుష్ప్రభావాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నిర్ణీత వయసు లోబడిన మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా కఠిన విధివిధానాలు రూపొందించాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోషల్ మీడియా జవాబుదారీతనంపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సమావేశం అయింది. అంతర్జాతీయ స్థాయిలో అమలులో ఉన్న చట్టాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో పటిష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలని స్పష్టం చేశారు.
చిన్నారుల భద్రత కోసం సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అమలులో ఉన్న సోషల్ మీడియా నిషేధ విధానాలను పరిశీలించాలని లోకేష్ సూచించారు. ముఖ్యంగా మలేషియాలో మై డిజిటల్ ఐడీ ద్వారా 16 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఇచ్చే విధానంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. మన దేశంలో కూడా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను పరిగణనలోకి తీసుకుని, చిన్నారులను డిజిటల్ వ్యసనం నుంచి కాపాడేలా ఎంత వయోపరిమితి విధించాలనే అంశంపై అధికారుల బృందం కసరత్తు చేయనుంది.
కేవలం నియంత్రణే కాకుండా, సోషల్ మీడియాను విద్వేష వేదికగా మార్చుకుంటున్న వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. కులం, మతం, ప్రాంతం పేరుతో పోస్టులు పెట్టే హెబిచ్యువల్ అఫెండర్స్ ను కట్టడి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ మేరకు ఐటీ చట్టం సెక్షన్-46 ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. వచ్చే సమావేశానికి గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ , ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థల కంప్లయన్స్ ఆఫీసర్లను కూడా పిలిపించి, తప్పుడు సమాచారంపై చర్చించనున్నారు.
సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, కంప్యూటర్ రిలేటెడ్ ఎఫెండర్స్ కట్టడిపై హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సహయోగ్ పోర్టల్ ద్వారా కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.