నారా లోకేష్ ప్రజాదర్భార్ను 70వ సారి నిర్వహించారు. ప్రతి సారి ఉండవల్లిలోని నివాసంలో నిర్వహిస్తారు. ఇది ప్రధానంగా మంగళగిరి ప్రజలకు ఉద్దేశించినది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా తమ సమస్యలు చెప్పుకుంటారు. ఈ సారి నారా లోకేష్ టీడీపీ ఆఫీసులో ప్రజలు, క్యాడర్ సమస్యలు విన్నారు. ఇందు కోసం దాదాపుగా నాలుగు వేల మంది వివిధ నియోజకవర్గాల నుంచి తరలి వచ్చారు. నాలుగు గంటల పాటు లోకేష్ అందరి సమస్యలు విన్నారు కానీ.. అసలు ఇంత మంది ఎందుకు వచ్చారన్నది మాత్రం టీడీపీ నేతలు చర్చించడం లేదు .
కిందిస్థాయి యంత్రాంగం ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదా ?
ప్రజలు లేదా కార్యకర్తలు ప్రతి సమస్యకు పై స్థాయి వరకూ రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చారంటే ఎకోసిస్టమ్ బిల్డ్ కాకపోవడమో.. సరిగ్గా పని చేయడమో జరుగుతోందని అర్థం. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నవారు అన్ని సమస్యల్నీ పట్టించుకోలేరు. ఆ స్థాయి దాకా రావాలంటే ఆ సమస్య అంత పెద్దది అయి ఉండాలి. కానీ లోకేష్ కు చెప్పుకునేందుకు వచ్చిన వారి సమస్యలు నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం అయ్యేవే. పోలీసులు, అధికారులతో సమన్వయం చేస్తే అయిపోతాయి. అలాంటివి లోకేష్ వరకూ ఎందుకు వస్తున్నాయి ?
నారా లోకేష్ ప్రయత్నిస్తున్న ఎకోసిస్టమ్ ఇంకా బిల్డ్ కాలేదా ?
నారా లోకేష్ పార్టీలో ఓ ఎకోసిస్టమ్ ఉండాలని ప్రయత్నిస్తున్నారు. సాయం కోసం.. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి ఎక్కువ శ్రమ లేకుండా మొదటి అంచెలోనే పరిష్కారం దొరకాలని అనుకుంటున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఎస్కలేట్ చేయవచ్చు కానీ.. చిన్న చిన్న సమస్యలకూ పై స్థాయి వరకూ వస్తున్నారంటే.. కింది స్థాయిలో ఎవరూ సరిగ్గా పట్టించుకోవడంలేదన్న మాట. ఈ విషయంలో లోకేష్ మార్క్ ఎకోసిస్టమ్.. గాడిన పడలేదని అర్థమవుతుంది.
లోకేష్ కఠినంగా వ్యవహరించాల్సిన సమయం
చాలా నియోజకవర్గాల్లో నేతలు పెడసరంగా ఉంటున్నారు. తమకు ఎదురులేదన్న భావనలో ఉన్నారు. ప్రజల్ని పట్టించుకోవాల్సిన పని లేదనుకుంటున్నారు. ఇలాంటి వారి వల్లే ఎకోసిస్టమ్ దెబ్బతింటోంది. వారిని పూర్తిగా ప్రజా కోణంలోకి మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే నారా లోకేష్ వద్దకే అన్ని సమస్యలతో ప్రజలు వస్తారు. ఆయన అందుబాటులో లేకపోతే వ్యతిరేకత పెంచుకుంటారు. ఈ అంశంపై అత్యవసరంగా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
