నారా లోకేష్ రెడ్ బుక్ లో మూడు పేజీలు మాత్రమే పూర్తయ్యాయని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలు తప్పుడు పనులు చేసి … వారిపై చర్యలు తీసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆరోపిస్తున్నారు. అయితే నారా లోకేష్ మాత్రం రెడ్ బుక్ అన్నా.. అది పూర్తిగా చట్టపరిధిలోనే ఉంటుందని తప్పుడు పనులు చేసిన వారిని వదిలి పెట్టేదిలేదని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికి మూడు పేజీలు మాత్రమే పూర్తయిందని తాజాగా రాజమండ్రిలో ప్రకటించారు. రప్పారప్పా అని వైసీపీ నేతలు అంటున్నారని తాము రెండు రప్పారప్పాలివ్వగమని సైటైర్లు వేస్తున్నారు.
అరాచకాలు చేసిన వైసీపీ నేతల కలల్లోకి రెడ్ బుక్
వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన వారందరి సంగతి చూడటానికి నారా లోకేష్ రెడ్ బుక్ పెట్టుకున్నారు. ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ చెప్పారు. ఆయన రెడ్ బుక్ కు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఇతర పార్టీలన్నీ తాము కూడా తమ బుక్ పెట్టుకుంటామని ప్రకటించేత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వైసీపీ నేతలు రెడ్ బుక్ అంటే భయపడటం ప్రారంభించారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై దాడులు చేసిన వారు.. వారి కుటుంబాలను అసభ్యంగా తిట్టినవారిని చట్టం ముందు పెడుతూండటంతో చాలా మంది పారిపోయారు. మిగిలిన వారు కలుగుల్లో దాక్కున్నారు.
ఎన్ని చర్యలు తీసుకున్నా చట్ట ప్రకారమే !
ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది గతంలో చేసిన నేరాలకు జైలు పాలయ్యారు. ఎవర్నీతప్పుడు కేసుల్లో ఇరికించారని ప్రజలు అనుకోవడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని కూడా అనుకోవడం లేదు. అందరికీ అన్ని న్యాయపరమైన అవకాశాలు లభిస్తున్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కకపోతేనే అరెస్టు అవుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకెళ్లింది సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కకపోవడంతోనే. దాదాపుగా అందరూ అంతే. చట్ట ప్రకారం వారు చేసిన తప్పుల్ని న్యాయస్థానాల ముందు పెట్టి.. బలంగా వాదిస్తున్నారు. వారు నేరాలు చేసింది నిజం కాబట్టి జైలుకు వెళ్తున్నారు.
మిగిలిన వాళ్లకూ తప్పదు !
కొంత మంది నాటకాలు ఆడుతూ.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవర్నీ వదిలి పెట్టే అవకాశం లేదని నారా లోకేష్ క్లియర్ గా చెబుతున్నారు. కొంత మంది కాలునొప్పని.. గుండెనొప్పని తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ.. అసలు ట్రీట్ మెంట్ మాత్రం అందకుండా ఉండదని సంకేతాలిస్తున్నారు. ఇలాంటి వారే తాము వస్తే రప్పారప్పా అని బెదిరిస్తున్నారు. కానీ తాము అధికారంలో ఉన్నామని తల్చుకుంటే రెండు రప్పారప్పాలిస్తామని మర్చిపోవద్దని లోకేష్ నేరుగా చెబుతున్నారు. దారి తప్పితే ఇస్తారు కూడా. ఆ విషయం వైసీపీ నేతలకు బాగా తెలుసు.


