ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. ‘ప్ర‌తినిధి 2’ తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన సినిమాల్లో ‘ప్ర‌తినిధి’కి ప్ర‌త్యేక స్థానం ఉంది. సామాన్యుడి వేద‌న‌కు అద్దం ప‌ట్టిన క‌థ అది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకొంది. నారా రోహిత్ బాడీ లాంగ్వేజ్‌కి ఆ పాత్ర స‌రిగ్గా సూట‌వుతుంది కూడా. అందుకే ఈసీక్వెల్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘టీవీ 5’ మూర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, ఆయ‌న మీడియా నుంచి రావ‌డం, ఇది మీడియా క‌థ అవ్వ‌డంతో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఇప్పుడు టీజ‌ర్ వ‌దిలారు. ఇందులో క‌థానాయ‌కుడు మీడియా ప్ర‌తినిధిగా క‌నిపించ‌నున్నాడు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతినీ, ప్ర‌జ‌ల్లో పెరిగిపోతున్న బ‌ద్ద‌కాన్ని ప్ర‌శ్నించ‌డానికి వ‌చ్చిన ప్ర‌తినిధి అవ‌తారం ఎత్తాడు నారా రోహిత్‌.

‘ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప‌, అభివృద్ది ఎక్క‌డ ఉంది సార్‌?’ అని అడిగిన ప్ర‌శ్న‌… నేరుగా ఇప్ప‌టి ముఖ్య‌మంత్రుల‌కు ఛెళ్లున త‌గులుతుంది. ”ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వండి ఒళ్లు విరిచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఓటేయండి. లేదా ఈదేశం విడిచి వెళ్లిపోండి. అదీ కుద‌ర‌క‌పోతే చ‌చ్చిపోండి” అంటూ ఓట‌ర్ల‌కు హిత‌బోధ చేశారు చివ‌ర్లో. ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌నీ, నేత‌ల్ని కౌంట‌ర్ చేసే విష‌యాలు ఈ క‌థ‌లో పుష్క‌లంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. యాక్ష‌న్‌కీ పెద్ద పీట వేశార‌ని టీజ‌ర్ చూస్తే అర్ధ‌మ‌వుతోంది. రోహిత్ లుక్ కూడా బాగుంది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొంది. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

2 COMMENTS

Comments are closed.