నారా లోకేష్ గురువారం రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. గతంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రధానితో భేటీ అయ్యారు. అప్పుడు రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడలేదు. పూర్తిగా వ్యక్తిగత అంశాలపై మాట్లాడి వచ్చారు. అయితే ఈ సారి మాత్రం పరిపాలనా పరమైన అంశాలు, రాజకీయ ఎజెండాపైనే చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.
ప్రధాని మోదీతో లోకేష్ ఏ అంశాలపై చర్చించాలనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో గత ప్రభుత్వ అవినీతి విషయంలో చేస్తున్న విచారణల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బయటకు తెలిసింది కొంతే.. కానీ తెలియాల్సింది చాలా ఉంది. లిక్కర్ స్కామ్లో ఆ రికార్డులన్నీ సిట్ అధికారుల వద్ద ఉన్నాయి. వీరు దోపిడీ చేసిన సొమ్మును.. ప్రధాన నిందితుడికి చేరిన విషయాన్ని గుర్తించారు. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ దిశగా మోదీతో చర్చించే అవకాశాలు ఉన్నాయని అంచనా.
మరో వైపు జగన్ మోహన్ రెడ్డి తన కేసుల నుంచి రక్షణ కోసమే.. బీజేపీతో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారని.. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో నిర్వహిస్తున్న బంధాల గురించి కూడా బీజేపీ పెద్దలకు వివరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ పర్యటనలో నారా లోకేష్.. పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది.