ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ర్యాలీ ఏర్పాటు చేశారు. అందులో పాల్గొనడంతో పాటు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడం, శివాజీ క్షేత్రంలో ధ్యానం చేయడం ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఈ టూర్లో మోదీతో పాటు ఉంటారు.
ప్రధాని మోదీ తన ఏపీ పర్యటన గురించి ఒక రోజు ముందే తెలుగులో సోషల్ మీడియాలో వివరించారు. ఏపీ గురించి గొప్పగా చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ ఏపీ పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపుతున్నారు. కేంద్రం అనుమతించాల్సిన ప్రాజెక్టులు ఏమైనా వస్తే అనుమతులు ఇస్తున్నారు. ఏమైనా అంతర్జాతీయ దౌత్యపరమైన ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తున్నారు. ఆర్సెలార్ మిట్టల్ తో పాటు ఇతర పెట్టుబడులకు ఉన్న అడ్డంకుల్ని తొలగించారు. అదే సమయంలో కేంద్రం తరపున ఎంత వరకు చాన్స్ ఉంటే అంత వరకూ ప్రాజెక్టుల్ని కేటాయిస్తున్నారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాలను అమలు చేయడానికి ముందుకు రాలేదు. మ్యాచింగ్ గ్రాంట్ కట్టాల్సి వస్తుందన్న కారణంగా అన్ని కేంద్ర పథకాల్ని వద్దనుకున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రతి రూపాయిని అందుకుంటోంది. ఇది ప్రధాని మోదీని ఆకట్టుకుంటోంది. పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. తాజాగా ఆయన శ్రీశైలం పర్యటనలో పదమూడు వేల కోట్ల రూపాయల పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మరికొన్ని వరాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ఎప్పుడు వచ్చినా ప్రత్యేకంగా ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి పునర్ నిర్మాణ సభ కానీ..యోగాంధ్ర కానీ మోదీ మరచిపోలేని విధంగా నిర్వహించారు. యోగాంధ్ర విజయంపై ప్రత్యేక నివేదిక కూడా మోదీ తెప్పించుకున్నారు. ఇప్పుడు కర్నూలు టూర్ ను కూడా అలాగే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.