పాకిస్తాన్ కాల్పుల ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడితే అంతకు అంతగా సమాధానం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రివిధ దళాలకు పిలుపునిచ్చారు. తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో పరిస్థితులు, కాల్పుల విరమణ ఒప్పందం.. ఉల్లంఘనలకు అంశంపై మాట్లాడారు. ఈ సమావేశంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ కు అప్పగించడం మినహా పాకిస్తాన్ కు మరో మార్గం లేదని ప్రధాని అంచనా వేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ మారలేదని గుర్తు చేశారు. పీవోకే తో పాటు ఉగ్రవాదుల్ని అప్పగించడంపైనే చర్చలు జరుగుతాయని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. త్రివిధ దళాలు అప్పమత్తంగా ఉండాలన్నారు. కాల్పులు జరిగితే మాత్రం ఊపేక్షించవద్దని స్పష్టం చేశారు.
మేము మధ్యవర్తిత్వం వహించామని.. అమెరికా ప్రకటించుకున్న అంశంపైనా మోదీ స్పందించారు. భారత్ కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. ఏదైనా ఉంటే.. నేరుగా తేల్చుకుంటామన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సింది పాకిస్తానేనని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఏ మాత్రం ఉగ్రవాదుల్ని ప్రోత్సహించినా.. సరిహద్దుల్లో కాల్పులు జరిగినా.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.