నరేంద్ర మోదీ అంటే.. దేశంలో ఎంత మంది అభిమానిస్తారో అంత కంటే ఎక్కువ వ్యతిరేకించేవారు ఉన్నారు. అది ఆయన విధానాల ప్రకారం. కానీ పరిపాలనా పరంగా ఇప్పుడు ఆయనను అభిమానించేవారు ఎక్కువగా ఉన్నారు. పదేళ్ల పాటు ఆయన టాక్సుల పేరుతో దోచుకున్నారని విమర్శలు ఉన్నా ఇప్పుడు మాత్రం.. ఆయన ఇస్తున్న రిలీఫ్‌లు మాత్రం అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. వాత పెట్టి వెన్న పూస్తున్నారని ..సెటైర్లు వినిపిస్తున్నా… ఇతరులు ఉంటే అది కూడా చేయరని నమ్ముతున్నారు. అందుకే మోదీ ఇప్పుడు అందర్నీ .. ముఖ్యంగా మధ్యతరగతికి బాగా నచ్చేస్తున్నారు.
ఇన్ కంట్యాక్స్ రిలీఫ్‌తో మధ్యతరగతి ఖుషీ
గత ఏడాది మార్చి వరకూ.. నెలకు 60వేలు సంపాదించే వారూ ఇన్ కంట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఎలా చూసినా.. ఏడాదికి నలభై వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ నలభై వేలు మిగులుతున్నాయి. పన్నెండు లక్షల వరకూ ట్యాక్స్ లేదు. మన దేశంలో లక్ష దాటిన జీతగాళ్లు పదిశాతం కూడా ఉండరు. అంటే 90 శాతం జీతాలు తీసుకునే ఉద్యోగులందర్నీ మోదీ సంతోషపెట్టారు. ఒక్కొక్కరికి సగటున లక్ష ఆదాయపు పన్ను మిగిలేలా చేయగలిగారు. అంత కంటే సంతోషం ఏముంటుంది?
జీఎస్టీ తగ్గింపుతో మరింత ఖర్చులు ఆదా
జీఎస్టీ రేషనలైజేషన్ చేయడం వల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలు బాగా లబ్ది పొందుతారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎంతో కొంత దిగి వస్తాయి. చేసుకునే సేవింగ్స్ పెరుగుతాయి. ఇల్లు , కారు లాంటి తమ కోరికను తీర్చుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. అటు ఇన్ కంట్యాక్స్ ద్వారా మిగిల్చిన డబ్బులు.. ఇటు జీఎస్టీ సడలింపుల ద్వారా మిగిలే ఆదాయం మధ్యతరగతి ఎంతో విలువైనవి. ఇవి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
ఇప్పుడల్లా ఎన్నికలు లేకపోయినా ఈ నిర్ణయాలు – మోదీ ఆర్గానిక్
సాధారణంగా రాజకీయ పార్టీలు .. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు.. ఎన్నికల ప్రయోజనాల కోసం రిలీఫ్‌లు ఇస్తూంటారు. కానీ మోదీ ఎలాంటి ఎన్నికలు లేకపోయినా.. మధ్యతరగతిని కరుణించారు. పన్నుల మీద పన్నులు అని ప్రజలు అసహనం చెందకుండా.. చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నారు. ఏర్పడాల్సిన అసహనం కాస్తా ఆయనపై అభిమానంగా మారుతుందనడంలో సందేహం లేదు.
