జస్టిస్ సిక్రీకి మోడీ రిటర్న్ గిఫ్ట్..! కానీ తీసుకోవడానికి సిగ్గుపడ్డారు..!

లండన్ కేంద్రంగా ఉన్న కామన్వెల్త్ సెక్రటేరియట్ అర్బిట్రల్ ట్రిబ్యునల్ మెంబర్ గా ..సుప్రీంకోర్టు జస్టిస్ .. ఏకే సిక్రికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ట్రిబ్యునల్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆయనకు కల్పించింది. అంత వరకూ బాగానే ఉంది కానీ.. జస్టిస్ సిక్రీనే ఎందుకు… అనే ప్రశ్న చాలా మందిలో వచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న రంజన్ గోగోయ్ తర్వాత సీనియర్ అయిన .. చీఫ్ జస్టిస్ కాకుండానే రిటైర్ కాబోతున్నారు. రిటైర్ అవగానే ఆయనకు లండన్ కామన్వెల్త్ సెక్రటేరియట్ అర్బిట్రల్ ట్రిబ్యునల్ మెంబర్ గా కేంద్రం చాన్సిచ్చింది. అయితే… ఇది వివాదాస్పదం అవుతోంది. దీనికి కారణం.. సీబీఐ డైరక్టర్ గాఅలోక్ వర్మను తొలగించడంలో జస్టిస్ సిక్రీనే కీలకంగా వ్యవహరించారు కాబట్టి.

సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మను తొలగించిన హైపవర్ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సభ్యులుగా ఉంటారు. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సమావేశానికి డుమ్మాకొట్టారు. తన స్థానంలో సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్న … జస్టిస్ సిక్రీని సమావేశానికి పంపారు. అలోక్ వర్మను తీసేయాలని మోడీ.. ఉంచాలని.. ప్రతిపక్ష నేత ఖర్గే పట్టుబట్టారు. అది సహజమే. అలోక్ వర్మపై ఉన్న అభియోగాలు, ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన సుప్రీంకోర్టు జస్టిస్ ఏకీ సిక్రీ… అలోక్ వర్మకు.. సహజ న్యాయమూత్రాలు కూడా వర్తింప చేయకుండా.. తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా.. అలోక్ వర్మపై వేటేయడానికే మొగ్గు చూపారు. తర్వాత.. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షించిన ఇద్దరు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు.. అలోక్ వర్మ పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. దాంతో జస్టిస్ సిక్రీపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. ఆయన కేంద్రం రిటైరవ్వగానే పదవి కట్టబెట్టింది. ఇది క్విడ్ ప్రో కోనే అనే … విమర్శలు బహిరంగంగానే రావడం ప్రారంభమయ్యాయి

అయితే… జస్టిస్ సిక్రీ.. ఈ విమర్శలతో మనస్థాపానికి గురయ్యారు. తనకు కామన్వెల్త్ సెక్రటేరియట్ అర్బిట్రల్ ట్రిబ్యునల్ మెంబర్ పదవి వద్దని… న్యాయశాఖకు లేఖ రాశారట. అయితే.. ఇదంతా.. రొటీనేనని.. కేంద్రం ఆయనకు పదవి ఇవ్వడం ఖాయమేనని చెబుతున్నారు. మొత్తానికి.. అలోక్ వర్మ తొలగింపు వ్యవహారం కూడా… రాఫెల్ డీల్ లా…. తవ్వే కొద్దీ బయట పడుతున్న.. అనుమానాల్లా ఉంటున్నాయి కానీ.. ఒక్క దానికీ… సమాధానం దొరకడం లేదు. మరో వైపు.. ప్రధాని నరేంద్రమోడీ మాత్రం… దేశంలో వ్యవస్థలు ఎంత గొప్పగా ఉన్నాయో… చిత్రమైన కథల ద్వారా ప్రజలకు.. బహిరంగసభల్లో వినిపిస్తూ ఉన్నారు. మరో వైపు ఎప్పుడూ లేని విధంగా సుప్రీంకోర్టు జస్టిస్ ల తీరుపైనే విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com