ఈ సంక్రాంతికి తెలుగు నుంచి 5 సినిమాలు వస్తున్నాయి. వాటిలో శర్వానంద్ సినిమా కూడా ఉంది. ‘నారీ నారీ నడుమ మురారి’తో ఆయన ఈ పండక్కి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. సంక్రాంతి సీజన్ శర్వాకు బాగా కలిసొచ్చింది. ‘రన్ రాజా రన్’, ‘శతమానం భవతి’ పండక్కే వచ్చి సూపర్ హిట్టయ్యాయి. అదే సెంటిమెంట్ ఈసారి కూడా కంటిన్యూ అవుతుందని శర్వా భావిస్తున్నాడు. తన కెరీర్లో చాలా కీలకమైన సినిమా ఇది. ఎందుకంటే.. ఈమధ్య శర్వాకు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. తను మళ్లీ ట్రాక్ ఎక్కాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే. అందుకే అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొన్నాడు శర్వానంద్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి, సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేశాడు. ‘బైకర్’ అనే సినిమా పక్కన పెట్టి, ఈ సినిమా ముందుగా పూర్తి చేశాడు. అంతేకాదు.. ఈ సినిమా కోసం శర్వానంద్ రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. సినిమా పూర్తయ్యాక, లాభాల్లో వాటా అందుకోబోతున్నాడని తెలుస్తోంది. నిజంగా ఇది మంచి పరిణామం.నిర్మాతలకూ కాస్త ధైర్యం కుదురుతుంది. రవితేజ కూడా ఇలానే ఆలోచించారు. ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమా కోసం రవితేజ రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని నిర్మాత స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు శర్వా కూడా అదే చేశాడు.
జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మేశారు. అమేజాన్ ఓటీటీ హక్కుల్ని రూ.17 కోట్లకు దక్కించుకొందని తెలుస్తోంది. జీ తెలుగు శాటిలైట్ కోసం రూ.3 కోట్లు చెల్లించింది. ఆడియో రైట్స్ రూపంలో మరో రెండున్నర కోట్లు వచ్చాయి. అంటే.. 22.5 కోట్లు ముందే నిర్మాత రాబట్టుకొన్నారు. ఇది ఓ రకంగా మంచి డీల్. మంచి టాక్ సంపాదించుకొని, సంక్రాంతి సీజన్ కలిసొస్తే.. నారీ నారీ నడుమ మురారి నిర్మాతలకు మంచి లాభాల్ని అందించిన ప్రాజెక్ట్ గా మిగలడం ఖాయంలా అనిపిస్తోంది.
