రివ్యూ: @ న‌ర్త‌న‌శాల‌

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.75/5

కూర పూర్తిగా ఉడికితే రుచిగా ఉంటుంది
ప‌చ్చివి తింటే… ఆరోగ్యం
ఉడికీ ఉడ‌క‌న‌ట్టు ఉడికితేనే… క‌డుపునొప్పి ప‌ట్టుకుంటుంది.
కొన్ని క‌థ‌లూ అంతే.
ఏదీ పైపైన చెప్పుకుంటూ వెళ్ల‌కూడ‌దు. ఓసారి దిగితే… దాని అంతు చూసేయాలి. లోలోప‌ల‌కి వెళ్లిపోవాలి. ఆ కాన్సెప్టు నుంచి ఎంత కామెడీ పిండుకోవాలో, ఎంత ఎమోష‌న్ రాబ‌ట్టుకోవాలో.. అంతా లాగేయాలి. ఏదో చేద్దాంలే, ఏదో తీద్దాంలే.. అనుకుని మొహ‌మాట‌ప‌డుతూ పోతే

‘@న‌ర్త‌న‌శాల‌’లా ఉంటాయి వ్య‌వ‌హారాలు. ఓ మ‌గాడు… అనుకోని ప‌రిస్థితుల్లో ‘మాడా’లా తేడా తేడాగా న‌టించాల్సివ‌స్తుంది. అత‌నికి మ‌రో ‘పొత్రం’గాడు లైన్ వేయ‌డం మొద‌లెడ‌తాడు. నిజంగానే భ‌లేటి పాయింటు. కామెడీకి బోల్డంత స్కోప్ ఉంది. ఈ పాయింట్ ని కామెడీ సెన్స్ ఉన్న‌ ఏ మారుతి లాంటి ద‌ర్శ‌కుడో అయితే ఇర‌గేసి మ‌ర‌గేసి ఉతికి ఆరేసేవాడు. కానీ.. ఓ కొత్త ద‌ర్శ‌కుడి చేతిలో ప‌డింది. మ‌రి ఇక్క‌డేం జ‌రిగింది..??

* క‌థ‌:

ఆడ‌పిల్ల కోసం ఎదురుచూస్తుంటే… మ‌గ‌పిల్లాడు పుట్టాడ‌ని, వాడినే ఆడ‌పిల్ల‌గా మార్చేసి, పెంచుతాడు ఓ తండ్రి (శివాజీ రాజా). త‌ను పెరిగి పెద్ద‌వాడై (నాగ‌శౌర్య‌) అమ్మాయిల‌న్ని ఉద్ధ‌రించే కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటాడు. ఏ అమ్మాయిపైకీ మ‌న‌సు పోదు. అలాంటివాడ్ని గిర గిర త‌న‌వైపుకు తిప్పుకుంటుంది ఓ అమ్మాయి (క‌ష్మీర‌). ఇద్ద‌రికీ సెట్ట‌యిపోయింద‌నుకునేస‌రికి.. మ‌రో అమ్మాయి (యామిని) ఈ క‌థ‌లోకి వ‌స్తుంది. వ‌స్తూ వ‌స్తూ క‌న్‌ఫ్యూజ‌న్‌ని మోసుకొస్తుంది. ఆ గంద‌ర‌గోళంలో శివాజీ రాజా చేసిన ఓ పొర‌పాటు వ‌ల్ల‌… నాగ‌శౌర్య ఇర‌కాటంలో ప‌డిపోవాల్సివ‌స్తుంది. అందులోంచి త‌ప్పించుకోవ‌డానికి ‘నేను గేని’ అంటూ ఓ అబ‌ద్దం చెబుతాడు. అక్క‌డి నుంచి.. నాగ‌శౌర్య‌ని అజ‌య్ త‌గులుకుంటాడు. ఆ త‌ర‌వాత ఏం జ‌రిగింద‌న్న‌దే క‌థ‌.

* విశ్లేష‌ణ‌:

కామెడీ సినిమాల‌కు చిన్న పాయింట్ చాలు. దాన్ని చించి, చాటంత చేసి, చాపంత చేసేస్తుంటారు. కాక‌పోతే కామెడీ టింజ్ తెలియాలి. ఈవీవీ నుంచి మారుతి వ‌ర‌కూ ఎత్తుకున్న‌వ‌న్నీ చిన్న చిన్న పాయింట్లే. కానీ అందులోంచే వినోదం పండించారు. ‘@ న‌ర్త‌న‌శాల‌’లో పాయింట్.. వినోదాన్ని పంచ‌డానికి స‌రిపోతుంది. కానీ.. దాన్నివాడుకునే ప‌ద్ధ‌తి తెలియాలి. క‌థ మొద‌ల‌వ్వ‌గానే గేరు మార్చి ‘గే’ ఎపిసోడ్ల‌లోకి వెళ్లిపోతే.. ఈ క‌థ‌ని రెండు గంట‌ల పాటు న‌డ‌ప‌లేం అనుకున్నాడు ద‌ర్శ‌కుడు. అందుకే… ‘గే’ పాయింట్ ఇంట్ర‌వెల్ బ్లాక్ వ‌ర‌కూ ట‌చ్ చేయ‌లేదు. ఆ స‌న్నివేశాల్ని హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌తో, అమ్మాయిలకు పంచే మోటివేష‌న్ సీన్ల‌తో, శివాజీ రాజా వేసే తిక్క వేషాల‌తో గ‌డిపేయాల‌ని చూశాడు. అదీ స‌రిపోక‌.. స‌త్యం రాజేష్‌ని రంగంలోకి దించి కామెడీ చేయించాల‌ని చూశాడు. అయితే… ఇవ‌న్నీ అంత‌గా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. అలాగ‌ని న‌వ్వించ‌లేద‌ని కాదు. ప్రతిరోజూ పెట్రోలు రేటు పెంచుకుంటూ పోయి.. మ‌ధ్య‌లో ఎప్పుడో ఓసారి ప‌దిపైస‌లు త‌గ్గించిన‌ట్టు.. అక్క‌డ‌క్క‌డ కామెడీ దొర్లింది. అయితే శివాజీ రాజా ఓవ‌రాక్ష‌న్‌తో, జేపీ అరిగిపోయిన డైలాగుల‌తో.. ఆ న‌వ్వుల్ని కూడా మ‌ర్చిపోయేలా చేశారు.

ఈ క‌థ ఎంచుకున్నారంటే కార‌ణం… ఈ పాయింట్ నుంచి వినోదం పంచే ఛాన్స్ ఉంద‌ని అటు హీరో, ఇటు ద‌ర్శ‌కుడు న‌మ్మ‌డం బ‌ట్టే. ఏ స‌న్నివేశాల నుంచి కామెడీ రాబ‌ట్టుకోవొచ్చో వాళ్ల‌కు తెలుసు కూడా. కాక‌పోతే.. ఆ ప్ర‌య‌త్నాలు స‌జావుగా సాగ‌లేదు. నాన్ స్టాప్ గా, క‌డుపు నొప్పి వ‌చ్చేలా పండిన స‌న్నివేశం క‌నీసం ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు. అన్నీ పైపైన న‌వ్వులే. ‘ఆ.. వీళ్లు వ‌చ్చారా?? ఆ… ఇప్పుడు న‌వ్విస్తారా’ అన్న‌ట్టు కాచుకుని కూర్చోవ‌డం, అప్పుడ‌ప్పుడూ బ‌ల‌వంతంగా న‌వ్వ‌డం మిన‌హాయిస్తే.. వినోదం స‌రిగా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. అజ‌య్ – శౌర్య‌ల మ‌ధ్య ఆ మాత్రం ‘రొమాంటిక్‌’ ట్రాక్ కూడా లేక‌పోతే.. న‌ర్త‌న‌శాల‌ని భ‌రించ‌డం క‌ష్టం అయిపోయేది. హీరో, హీరోయిన్‌, హీరో ఫ్యామిలీ, విల‌న్ ఫ్యామిలీ.. ఇలా అంద‌రినీ ప‌ట్టుకొచ్చి ఓ ఇంట్లో పెట్ట‌డం అనే ఫార్ములా ఇందులోనూ కనిపించింది. సెకండ్ హీరోయిన్‌ని చూపిస్తే జ‌నాలు ఝ‌డుసుకుంటార‌ని భ‌య‌ప‌డి ఓ గ‌దిలో బంధించేశారు. క‌ష్మిరాని కూడా స‌రిగా వాడుకోలేదు. ఈ కథ‌కు అస‌లు హీరోయిన్లు నాగ‌శౌర్య‌, అజ‌య్ అని ద‌ర్శ‌కుడు కూడా బ‌లంగా ఫిక్స‌యిపోయాడేమో?! హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాకు పేల‌వంగా ఉండ‌డం, స‌న్నివేశాల‌న్నీ ఫిల్లింగ్ కోసం రాసుకోవ‌డం… న‌ర్త‌న‌శాల‌ని మ‌రింత‌గా బాధించాయి.. ఆమాట‌కొస్తే హింసించాయి.

* న‌టీన‌టులు

శౌర్య హుషారైన న‌టుడు. అది ఈ సినిమాలోనూ క‌నిపించింది. ముఖ్యంగా కాలి వేలితో.. నేల‌పై సిగ్గు ప‌డుతూ వేసిన ముగ్గుల సీన్లో… నిజంగానే సిగ్గులేకుండా న‌టించాడు. ఆ త‌ర‌హా ఎక్స్‌ప్రెష‌న్లు ఇంకొన్ని ఉండి ఉంటే…బాగుండేది. అజ‌య్ – శౌర్య ఎపిసోడ్ల‌పై మ‌రింత దృష్టి పెట్టి ఉంటే.. ఈ క‌థ‌కు, పాత్ర‌కూ న్యాయం జ‌రిగేది. శౌర్య త‌ర‌వాత అన్ని మార్కులు అజ‌య్ కి ఇవ్వాల్సిందే. ఎంత మాన్లీగా క‌నిపిస్తాడో… అంతే ఇదిగా
‘గే’ పాత్ర‌లో ఇమిడిపోయాడు. హీరోయిన్లు ఇద్ద‌రివీ అంతంత మాత్ర‌పు పాత్ర‌లే. ‘ఈ సినిమా త‌ర‌వాత నాకు న‌టించే ఛాన్సు మ‌ళ్లీ రాదేమో’ అనుకుని శివాజీ రాజా… న‌ట‌న‌నంతా ఈ సినిమాలోనే ధార‌బోసే ప్ర‌య‌త్నంలో కాస్త అతి చేశాడు. ఇక జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి… త‌న యాస‌నీ, బాడీ లాంగ్వేజీనీ వ‌దులుకోలేని బ‌ల‌హీన‌త‌తో.. మంచి పాత్ర‌ని కూడా చెడ‌గొట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయిన‌ప్పటికీ ద‌ర్శ‌కుడు ఈ రెండు పాత్ర‌ల‌తో కాస్తో కూస్తో వినోదాన్ని రాబ‌ట్టుకోగ‌లిగాడు.

* సాంకేతికంగా…

ఇది శౌర్య సొంత సినిమా. కాబ‌ట్టి… నిర్మాణ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. రూపాయి ఎక్కువే ఖ‌ర్చు పెట్టారు. ఆ నాణ్య‌త పాట‌ల్లో క‌నిపించింది. ఫ్రేమ్ నిండా న‌టీన‌టుల‌తో నింపేశారు. పాట‌ల్లో ఒక‌ట్రెండు బాగున్నాయి. కెమెరా వ‌ర్క్‌, ఆర్ట్ ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడు మంచి పాయింట్ రాసుకున్నాడు. కానీ దాన్ని డీల్ చేసేంత సామ‌ర్థ్యం తన‌కు లేకుండా పోయింది. ‘ఛ‌లో’ త‌ర‌వాత ఆ స్థాయిలో విజ‌యం అందుకోవాల‌ని ఖ‌ర్చు పెట్టిన నిర్మాత‌ల‌కు చివ‌రికి ఆ ఖ‌ర్చే క‌నిపించేలా చేసింది.

* తీర్పు

వినోదం ఇప్పుడు చీప్ అయిపోయింది. బ‌బ‌ర్ ద‌స్త్ లాంటి కార్య‌క్ర‌మాల పుణ్యాన ఫ్రీగా కావ‌ల్సినంత ఫ‌న్ దొరికేస్తుంది. కేవ‌లం న‌వ్వుల కోస‌మే టికెట్టు పెట్టి థియేట‌ర్‌కి వెళ్లాలంటే.. ఆ వినోదం డ‌బుల్‌, ట్రిపుల్ ఉండాలి. ఇలా స‌గం స‌గం వంట‌లు సంతృప్తి నివ్వ‌వు.

* ఫైల‌న్ ట‌చ్‌: ‘తేడా’ చేసింది

తెలుగు360.కామ్ రేటింగ్ : 1.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com