దుల్కర్ సల్మాన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్ర చేసినా తనకంటూ ఒక స్వాగ్ ఉంటుంది. నిజానికి ట్రూ పాన్-ఇండియా స్టార్ తను. ప్రతి భాషలో సూపర్ హిట్స్ ఉన్న హీరో. అయితే ఇప్పటివరకు “స్టార్” అనే ట్యాగ్లు తనకు తగిలించుకోలేదు. ఇప్పుడు కాంత సినిమా రూపంలో ఆయనకు ఒక కొత్త ట్యాగ్ వచ్చి చేరింది..అదే నట చక్రవర్తి.
తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో రానా ఈ బిరుదును ప్రకటించారు. “దుల్కర్ రెట్రో కింగ్. ఇండియాలో పీరియడ్ సినిమా అంటే ఫస్ట్ ఆప్షన్ అతనే. కాంత చూశాక అందరూ దుల్కర్‌ను నట చక్రవర్తి అని పిలుస్తారు”
ఇదే సమయంలో కాంత కథా నేపథ్యం గురించి కూడా ఆయన ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. “మేము చెన్నై నుంచి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఇక్కడ స్టూడియోలు లేవు. అందరూ విజయ, వాహిని, ఏవీఎం స్టూడియోలలో జరిగే సంగతుల గురించి మాట్లాడుకునేవారు. స్టార్స్ గురించి చెప్పుకునేవారు. ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది, కానీ అప్పుడు స్టూడియోలో జరిగే విషయాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసేవి. అలాంటి రెట్రో సినిమా రోజుల్లో నడిచే కథ ఇది. కాలాన్ని మళ్లీ క్రియేట్ చేసే శక్తి ఈ సినిమాకుంది. అలాంటి రీ-క్రియేషన్‌ను కాంతలో చూస్తారు” అన్నారు.