ఇండిగో సంక్షోభం ముగిసింది. కొన్ని రూల్స్ కు మినహాయింపులు ఇవ్వడంతో ఇండిగో విమానాలు యథావిథిగా సమయం ప్రకారం నడుస్తున్నాయి. పదిశాతం సర్వీసులను కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటి ఆ సర్వీసులు మిగతా విమానయాన సంస్థలకు కేటాయించారు. ఇప్పుడీ సమస్యపై దేశ ప్రజలకు జాతీయ మీడియా ద్వారా వివరించడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయత్నిస్తున్నారు.దాదాపుగా ప్రతి జాతీయ మీడియాకు ఆయన ఇంటర్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సిద్ధాంతపరంగా బీజేపీతో విబేధించే మీడియా నుంచి కూడా రామ్మోహన్ నాయుడు పనితీరు,ఆయన అప్రోచ్ కు ప్రశంసలు లభిస్తున్నాయి.
సంక్షోభం పీక్ లో ఉన్నప్పుడు ఆర్నాబ్ హడావుడి
ఇండిగో సంక్షోభం పీక్‌లో ఉన్నప్పుడు రిపబ్లిక్ టీవీ నుంచి ఆర్నాబ్ గోస్వామి హడావుడి చేశారు. రామ్మోహన్ నాయుడిదే తప్పు అని చెప్పేందుకు ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఆయన తీరు అలాగే ఉంటుంది. ఆయన మాటల్ని పట్టుకుని .. బీజేపీని వ్యతిరేకించేవారు, విపక్షాలు, వైసీపీ సోషల్ మీడియా అంతా ఆయనపై ఎటాక్ చేశారు. కానీ రామ్మోహన్ నాయుడు తన పని మీదనే దృష్టి పెట్టారు. సంక్షోభం ముగిసిన తర్వాత అన్ని మీడియా సంస్థలకూ ఇంటర్యూలు ఇచ్చి.. అసలేం జరిగిందో.. మళ్లీ అలాంటిది జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో వివరిస్తున్నారు.
ఇంగ్లిష్ చానల్స్ ఇంటర్యూల్లో సమస్య విశ్లేషించిన కేంద్ర మంత్రి
టైమ్స్ నౌ నుంచి ఇండియాటుడే వరకూ అన్ని ప్రధాన ఇంగ్లిష్ , హిందీ చానళ్లకు రామ్మోహన్ నాయుడు ఇంటర్యూలు ఇచ్చారు. అందరూ ఆర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలే అడిగారు.అయితే వారంతా సమాధానం చెప్పే అవకాశాన్ని కూడా రామ్మోహన్ కు ఇచ్చారు. తన పనితీరును విమర్శించేలా.. అనుమానపడేలా ప్రశ్నలు అడిగిన రామమోహన్ ఎక్కడా తడబడలేదు. ధృడంగా సమాధానమిచ్చారు. ఆయన సమస్యలను ఎదుర్కొన్న తీరు.. ఇంటర్యూలో ఇచ్చిన సమాధానాలు.. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటి వారు కూడా ప్రశంసలు కురిపించారు. యువనేతగా ఆయన సమస్యను పరిష్కరించిన వైనం.. మీడియా ద్వారా ప్రజలకు దాన్ని విశ్లేషించిన విధానం కూడా వారిని ఆకట్టుకుంది.
ఆర్నాబ్ జర్నలిజానికి కావాల్సింది వేరే
రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ జర్నలిజానికి కావాల్సింది బీజేపీ కోసం బలిపశువులు. కశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు మంత్రిత్వ శాఖ పనితీరు ఎలా ఉందో ఎప్పుడూ అడగలేదు. వరుస రైలు ప్రమాదాలు జరిగినప్పుడు అడగలేదు. పైగా అలా అడగడం దేశద్రోహం అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు మాత్రం విమానయానమంత్రిదే తప్పన్నట్లుగా వాదిస్తున్నారు. ఇండిగో తమ కంపెనీ నిర్వహణలో చేతకాని తనాన్ని… రామమోహన్ పై నెట్టే ప్రయత్నం చేశారు. కానీ రామ్మోహన్ సమర్థంగా ఎదుర్కొన్నారు.
