నవీన్ పొలిశెట్టి సినిమాలు ఫన్ రైడ్ గానే ఉంటాయి. ఆయన్ని అలా చూడడమే ప్రేక్షకులకు ఇష్టం. ఇప్పుడు కూడా అలాంటి సినిమా ఒకటి దించబోతున్నాడు. ఈ సంక్రాంతి బరిలో. అదే.. ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన సినిమా ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈనెల 14న వస్తోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. సినిమా టోన్, నవీన్ ఇమేజ్‌కి తగ్గట్టే… ఈ ట్రైలర్ మొత్తం ఫన్ రైడ్ గా సాగిపోయింది. పంచ్‌లు ఎక్కువగా వినిపించాయి.నవీన్ పొలిశెట్టికి ఒక రకమైన కామెడీ టైమింగ్ ఉంది. అది… ప్రతీ డైలాగ్ లోనూ పండింది.
నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ లో హంగామా మొదలైంది. హుండీ డైలాగ్, అటు తిరిగి మంత్రం చెప్పడం, వైట్ హౌస్ డైలాగ్, కుకట్ పల్లి ఫ్లై ఓవర్ పంచ్… ఇవన్నీ భలే అనిపించాయి. ఈసారి నవీన్ తో పాటుగా మీనాక్షి చౌదరి కూడా ఫన్ చేసినట్టు అనిపిస్తోంది.
”ప్రశాంతంగా ఉన్నోడ్ని.. ప్రశాంత్ నీల్ జోన్లోకి తీసుకొచ్చారు కదరా..”
”రాజుగాడి పెళ్లి.. ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటూ గుర్తుండిపోతుంది” లాంటి డైలాగులు ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్ మూమెంట్స్ కూడా ఉన్నాయన్న సంగతి బయట పెట్టాయి.
సంక్రాంతి సినిమాలకంటూ ఓ వైబ్ ఉంటుంది. ఆ వైబ్ ఈ ట్రైలర్ లో పుష్కలంగా కనిపించింది. మళ్లీ నవీన్ పొలిశెట్టి వన్ మాన్ షో చేశాడనిపిస్తోంది. రెండేళ్ల పాటు నవీన్ ఇదే కథపై అన్ని రకాలుగా వర్క్ చేశాడు. దానికి తగ్గ ఫలితం వస్తే… సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస పరాజయాలకు ఈ సినిమా బ్రేక్ వేసినట్టే.
