మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావును బలగాలు కాల్చి చంపాయి. ఇంకా అతి కొద్ది మంది టాప్ లీడర్స్ ఉన్నారు. వారు కూడా వృద్ధులు. వారందర్నీ అంతం చేసి..నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్రం ప్రకటిస్తోంది. అయితే నక్సలిజం ఎప్పుడో అంతమైపోయింది. మిగిలింది నక్సలైట్లు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ నక్సలిజానికి ఆకర్షితులు కావడం లేదు. గిరిజన గ్రామాల యువకులు కూడా నక్సలిజం పట్ల ఆసక్తిగా లేరు. ఫలితంగా నక్సలిజం తనకు తానుకు అంతమయిందని అనుకోవచ్చు.
నక్సలిజంపై అప్పట్లో క్రేజ్.. ఇప్పుడు లేదు !
ఒకప్పుడు నక్సలిజం అంటే యువతకు క్రేజ్. పీడితుల కోసం పని చేస్తారన్న భావన ఉండేది. రాజకీయ నేతలు అంటే దోపిడీ దారులని అనుకునేవారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చని అనుకునేవారు. యువతకు అప్పట్లో అవకాశాలు ఉండేవి కావు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే వ్యవసాయం, చిట్ ఫండ్ కంపెనీల్లో ఉద్యోగాలు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను గ్లోబలైజేషన్ కారణంగా అవకాశాలు పెరిగాయి. యువత కొత్త కొత్త అవకాశాల కోసం పరుగులు పెడుతున్నారు. నక్సలిజం అనేది అలాంటి అవకాశాలు పెరిగినప్పుడే అంతమయిపోయింది.
అకారణ హత్యలతో నక్సలిజం ఇమేజ్ డ్యామేజ్ – ప్రజల్లో వ్యతిరేకత
చంపడం అనే కాన్సెప్ట్ తో నక్సలైట్లు ఎప్పుడో దారి తప్పారు. ఎందుకు చంపుతారో తెలియదు .. ఏదో ఓ సంచలనం కోసం నేతల్ని చంపడం ప్రారంభించారు. ఇది వారి ఉద్యమానికి ఏ విధంగానూ మేలు చేయలేదు సరి కదా.. పతనానికి.. ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అయింది. తర్వాత నక్సలైట్లు ఇన్ఫార్మర్ల పేరుతో సొంత వారిని కూడా చంపుకున్నారు. గిరిజనుల్ని చంపారు. దాంతో నక్సలిజంపై సానుభూతి నుంచి ప్రజల్లో వ్యతిరేరకత ప్రారంభమయింది. ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా మావోయిస్టుల్ని కాల్చి చంపితే మాట్లాడటం లేదు.
ఉన్నవాళ్లు లొంగిపోతే బెటర్
మగిలిపోయిన మావోయిస్టులు తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని ఇప్పటికైనా గుర్తించాలి. వారు ముందుగాజన జీవన స్రవంతిలోకి రావాలి. ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయాలి. నక్సలిజం అంటే హత్యలు కాదని.. ప్రజల కోసం ఉపయోగపడే భావజాలం అని నిరూపించుకోవాలి. తమ బూర్జువా విధానాలకు కట్టుబడితే.. రాజ్యం .. మార్చి 31 లోపు కాల్చిపడేస్తుంది. కన్నీరుపెట్టేవారు కూడా ఉండరని ఇప్పటికే తేలిపోయింది.