జీఎస్టీ రేషనలైజేషన్ చేయడం ద్వారా తగ్గింపులు ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు రెండు శ్లాబులే అమలవుతున్నాయి. 5, 18శాతం శ్లాబుల్లోకి అన్ని వస్తువులు వచ్చాయి. దాదాపుగా అన్ని నిత్యావసర వస్తువులు ఐదు శాతంలోకి వచ్చాయి. ఇది మధ్యతరగతికి ఊరటనిచ్చే అంశమే. తమకు మేలు చేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ తగ్గింపులను విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలే కాస్త ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిందని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రచార భేరి మోగిస్తోంది. లబ్దిదారులు ఫీల్ అవ్వాల్సిన విషయాన్ని గట్టిగా వారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
తగ్గింపులు ప్రజలు ఫీల్ అయితే ప్రచారం ఎందుకు ?
జీఎస్టీపై ప్రచారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టి జీఎస్టీ తగ్గింపు వల్ల ఎంత మేలు జరుగుతుందో వివరిస్తున్నారు. చివరికి ప్రధాని మోదీ కూడా కర్నూలులో ర్యాలీ నిర్వహించడానికి వస్తున్నారు. పనిలో పనిగా కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, శ్రీశైలం స్వామి వారి దర్శనం ఉంటాయి . అయితే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం మాత్రం జీఎస్టీ ర్యాలీలో పాల్గొనేందుకు రావడం. ఈ అంశమే ఆశ్చర్య పరుస్తోంది. చేసింది కొంత.. చెప్పుకునేది ఎంతో అన్న అభిప్రాయం దీని వల్ల ప్రజల్లో మెల్లగా ఏర్పడే అవకాశం ఉంది.
ఇన్‌కంట్యాక్స్, జీఎస్టీ తగ్గింపులతో మధ్యతరగతికి ఊరటే
మధ్యతరగతి ప్రజలకు… గత పదేళ్లుగా ఏం చేశారన్నది మర్చిపోయేలా చేసేందుకు ప్రధాని మోదీ ఈ ఏడాది చాలా మంచి పనులు చేశారు. ఆదాయపు పన్నును ఏకంగా పన్నెండు లక్షల వరకూ మినహాయింపు ఇవ్వడం, జీఎస్టీ తగ్గించడం మధ్యతరగతికి మేలు చేసేదే. అయితే ఇదేమీ వారి జీవన ప్రమాణాలను పెంచదు. కానీ ఆర్థిక వెసులుబాటు ఇస్తుంది. అందులో సందేహం లేదు. తాము ఖర్చు పెట్టినప్పుడు.. ఆ లాభాన్ని పొందినప్పుడు.. తమ జీతంలో రెగ్యులర్‌గా కట్ అయ్యే ఇన్ కంట్యాక్స్ ఇప్పుడు కట్ కావడం లేదని తెలుసుకున్నప్పుడు సామాన్యుడు ఈ తగ్గింపులను ఫీల్ అవుతారు. అది సహజంగానే అభిమానంగా మారుతుంది. ఇలాంటి అభిమానం వల్ల ఉపయోగం ఉంటుంది.
ప్రచారం ఆర్గానిక్‌గా ఉండాలి.. డబ్బా కొట్టినట్లుగా కాదు !
ప్రభుత్వాలు చేసే పనులు, అమలు చేసే పథకాల వల్ల ప్రజలు మేలు జరిగిందని ఆర్గానిక్ గా ఫీల్ అవ్వాలి. మేము మీకు ఈ పని చేశాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. కానీ చాలా రాజకీయ పార్టీలు.. మేము చేసిన పనుల్ని మేము కాక ఇంకెవరు చెబుతారని విపరీతంగా ప్రచారం చేసుకుంటారు. కేంద్రం, రాష్ట్రం కూడా అంతే. నిజానికి ఏపీలో గతంతో పోలిస్తే ప్రచారం తగ్గింది. కానీ జీఎస్టీ తగ్గింపులపై ప్రచారం కాస్త ఓవర్ అవుతోంది. ఆర్గానిక్ గా ఉండటం లేదు. జీఎస్టీ తగ్గింపు వల్ల మేలు జరిగిందని ప్రజలు ఫీల్ అయితే అంత కంటే పెద్ద ప్రచారం ఉండదు.