కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మరణించారు. కారణం ఏమిటి.. ఎలా జరిగింది అన్నది పక్కన పెడితే .. అది ప్రమాదం. ప్రమాదాల్ని ఎవరూ ఆపలేరు. ఆ.. ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీలైనంతగా ప్రాణనష్టం తగ్గడానికి తగ్గ మార్పు, చేర్పులు ఉండాలి. రూల్స్ కఠినంగా పాటించాలి. కానీ అలాంటివేమీ మన దగ్గర ఉండవు. ప్రమాదం జరిగ్గానే బస్సుల్లో ఈ ఉల్లంఘనలు ఉన్నాయని మొత్తం ట్రావెల్స్ మీద మీడియా విషం చిమ్మేస్తుంది. అంతా అవినీతేనని తేల్చేస్తారు. అప్పటికప్పుడు అధికారులు కూడా కొంత హడావుడి చేస్తారు.కానీ పరిస్థితుల్లో మార్పు మార్పు రాదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది.
వ్యవస్థల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యం
ఆ .. ఏం జరుగుతుందిలే అని అనుకునే నిర్లక్ష్యం అన్ని చోట్లా పేరుకుపోయింది. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకుని పని చేయాల్సిన రంగాల్లో రోజూ చూసే జాగ్రత్తలే కదా ఈ రోజు చూడకపోతే ఏమవుతుందని అనుకుంటారు. అలా జాతీయ రహదారులపై డ్రైవింగ్ చేసే.. ముఖ్యంగా ఈ హైస్పీడ్ బస్సుల్ని డ్రైవ్ చేసే వాళ్లు కూడా అదే నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ప్రైవేటు బస్సు ప్రమాదాలు అదే పనిగా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో చాలా వరకూ ప్రమాదాల్లో ప్రయాణికులు బయటపడుతున్నారు. కర్నూలు ప్రమాదం నుంచి మాత్రం సగం మంది మాత్రమే బయటపడ్డారు.
మరిన్ని ప్రాణాలు పోకుండా చూడాలి !
కార్ల ప్రమాదాల్లో ప్రాణాలు ఎక్కువగా పోతున్నాయని.. ఆలోచించి ఎయిర్ బ్యాగ్స్ వ్యవస్థను తీసుకు వచ్చారు. ఎయిర్ బ్యాగ్స్ వల్ల భారీ ప్రమాదాలు జరిగినా ప్రాణాలు నిలబడుతున్నాయి. అందుకే చిన్న కార్లలోనూ అన్ని సీట్లకూ ఎయిర్ బ్యాగ్స్ ఉండాలనే రూల్ తీసుకు వచ్చారు. ప్రైవేటు బస్సుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు, సేఫ్టీ రూల్స్ పెట్టాల్సి ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా .. బస్సు సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే పారిపోవడం కాకుండా.. చివరి ప్రయాణికుడ్ని కూడా రక్షించేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంది. పారిపోతే ఎక్కడికిపోయినా పట్టుకొస్తారు. అదే అక్కడే ఉండి రక్షిస్తే కాస్త మానవత్వమైనా ఉందనుకుంటారు.
ఏం చేసినా ప్రమాదాల్ని ఆపలేరు.. ఎందుకంటే అవి ప్రమాదాలు !
జాగ్రత్తలు తీసుకుని ఇక ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని రాజకీయ నేతలు, అధికారులు చెబుతూ ఉంటారు. కానీ అది వారి వల్ల కాదు. ఎందుకంటే యాక్సిడెంట్స్ చెప్పి రావు. ఎంత గొప్ప డ్రైవర్ అయినా..ఆయన తప్పు లేకపోయినా ప్రమాదానికి గురికావొచ్చు. రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో ఇతరుల తప్పిదాల వల్లే ఎక్కువ మంది ప్రమాదాలకు గురువుతూంటారు. అందుకే వాటిని ఆపలేరు… కానీ ఇలాంటివి జరిగినప్పుడు.. శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా హడావుడి చేయకుండా.. మెల్లగా వ్యవస్థను మార్పుచేసేలా ప్రయత్నించాలి. సేప్ఠీ నార్మ్స్ పెంచాలి. ప్రయాణికులకు.. బస్సు సిబ్బందికి అవగాహన పెంచాలి. యజమానులకు బాధ్యత నేర్పాలి. అప్పుడే మెల్లగా మార్పు సాధ్యమవుతుంది.