హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన దుర్ఘటనలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆ స్థాయి ప్రమాదం కాదు. అన్ని ప్రాణాలు పోవాల్సినంత ప్రమాదం కాదు. కానీ ఊపిరి ఆడని పరిస్థితులు ఏర్పడటంతో అంత మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వాన్ని నిందించడం చాలా సులువు కానీ అసలు కారణం ఏమిటని.. ఆరా తీస్తే.. బాధిత కుటుంబం నిర్లక్ష్యం దగ్గర నుంచి దశాబ్దాలుగా వ్యవస్థల్లో పేరుకుపోయిన ఘోరమైన నిర్లక్ష్య పనితీరు కూడా కీలక కారణం.
పాతబస్తీలో అన్ని ఇళ్లూ అలాగే !
పాతబస్తీలో అన్ని ఇళ్లు చాలా ఇరుగ్గా ఉంటాయి. గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఇళ్లు ఇటీవలి కాలంలో నిర్మించినవి కావు.దశాబ్దాల కిందటే నిర్మించినవి. పెద్ద పెద్ద భవనాల నిర్మాణశైలి కూడా భిన్నంగా ఉంటుంది. మెట్లు కూడా చాలా చిన్న చిన్నవి కట్టుకుంటారు. ఓ మనిషి మాత్రమే ఎక్కడం, దిగడం చేయగలరు. అదే సమయంలో అగ్నిప్రమాదం జరిగితే .. లేకపోతే మరో విధంగా ఏదైనా జరిగి పొగలు వస్తే.. ఆ పొగలు పోయే మార్గం ఉండదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటే తప్ప ఉపయోగడం ఉండదు.అలాంటి చోట్ల ఏసీలు ఇప్పుడు ప్రతి గదికి ఉంటున్నాయి.
ఆ.. ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు బలి !
ప్రమాదం జరిగిన కుటుంబం వ్యాపార కుటుంబం కావడంతో దుకాణం కోసం.. ఇంటి కోసం ఏసీలను నిరంతరంగా వాడుతున్నారు. కానీ సర్వీస్ చేయించుకోవడంలో నిర్లక్ష్యం చూపించారు. ఫలితం ఘోరం జరిగిపోయింది. ఈ ఘోరం జరిగిపోవడానికి ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలే కారణం. ఫైర్ సిబ్బంది ఎంత వేగంగా వచ్చినా.. ఆస్పత్రికి తరలించినా ఆ పొగ ప్రమాకరంగా మారింది.
నిందించడానికి గ్రాంటెడ్‌గా దొరికే ప్రభుత్వం
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కోపం ఉంటుంది. తమ కోపం ఎవరిపై ఒకరిపై చూపించాలనుకుంటారు, అలాంటి వారికి దొరికేది ప్రభుత్వమే. అందుకే కొంత మంది అంబులెన్స్ లు సరిగ్గా లేదని.. వైద్య సౌకర్యాలు అని.. ప్రభుత్వాన్ని తిట్టి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని కాదు. దశాబ్దాలుగా అలాంటి ఇళ్లు నిర్మిస్తున్నా పట్టించుకోని నిర్లక్ష్యం బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పుడున్న ప్రభుత్వానిదా.. గత ప్రభుత్వానిదా అని కాదు. మొత్తం ప్రభుత్వాల నిర్లక్ష్యం ఈ ఘటన వెనుక ఉంది.
మరోసారి జరగకుండా నివారించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనని !
ఇప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగిందని అలాంటి ఇళ్లను తొలగించాలనుకుంటే పాతబస్తీలో ఒక్క ఇల్లు కూడా ఉండదు. ఎందుకంటే అక్కడ ఇళ్లన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే సమస్య పరిష్కారం గురించి వినూత్న ఆలోచనలు చేయాల్సి ఉంది. ప్రభుత్వంపైనే ఈ బాధ్యత ఉంది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సి ఉంది.