వైసీపీలో ఇతర పదవుల కన్నా హోంమంత్రి పదవికే ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ వైసీపీ అధికారంలోకి వస్తే తామే హోంమంత్రి అని కలలు కంటున్నారు. బయటకే చెప్పుకుంటున్నారు. వీరి తీరు చూసి వీరికి హామీలు ఇస్తున్న ఆ వైసీపీ పెద్ద మనిషి ఎవరా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతగా మాయ చేయవచ్చా అని కూడా ముచ్చటపడుతున్నారు.
కాబోయే హోంమంత్రినని నెల్లూరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న అరుణ
చిన్నపాటి టైలర్ నుంచి రౌడీ ముఠాలను మెయిన్ టెయిన్ చేసే వరకూ ఎదిగిన అరుణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆమె పోలీసులకే ఆఫర్ ఇచ్చారు. తాను కాబోయే హోంమంత్రినని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగులు, ప్రమోషన్లు ఇస్తానని వారికి చెప్పారు. ఆమె మాటలు విని.. ఆ పోలీసు అధికారులు కూడా … ఇలా అయిపోయాం ఏంటి అని అనుకుని ఉంటారు. అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో… అక్కడిదాకా ఎలా ఆలోచించారు అంటే.. వైసీపీలో అంతా కామనేనని అనుకోవాల్సి వస్తుంది.
గతంలో నందిగం సురేష్ భార్యది కూడా అదే డైలాగ్!
గతంలో నందిగం సురేష్ భార్య కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన కేసులో సురేష్ జైలుకెళ్లారు. ఆ సమయంలో వచ్చే ఎన్నికల్లో సురేష్ కు కాకుండా.. ఆయన భార్య బేబీలతకు తాడికొండ టిక్కెట్ ఇస్తారని.. గెలిచాక హోంమంత్రిని చేస్తారని ప్రచారం ప్రారంభించారు. అందరూ తనను కాబోయే హోంమంత్రిగా పిలుస్తున్నారని కూడా ఆమె చెప్పుకున్నారు. ఇక అందరి కంటే ముందు ఇస్తే గిస్తే తమకే ఇస్తారని విడదల రజనీ అనుచరులు చెప్పుకుంటున్నారు. బయటకు వచ్చేది కొన్నే కానీ.. ఈ హోంమినిస్టర్ జాబితాలో చాలా మంది ఉన్నారు. అసలు వీరికి ఎవరు ఇలాంటి ఆశలు కలిగిస్తున్నారన్నది చాలా మందికి అర్థం కావడం లేదు.
నేరగాళ్లందరికీ హోంమంత్రి ఆశ చూపుతున్నారా ?
వైసీపీలో లీడర్ గా నిలబడాలంటే.. నేరాలు చేసి ఉండాలన్నది ప్రాథమిక అర్హత. జేబు దొంగల నుంచి బడా రౌడీల వరకూ అందరికీ వైసీపీ రాజకీయ గమ్యస్థానం , ఇలాంటి వారు రెచ్చిపోవాలని .. కేసులు అయినా భయపడవద్దని .. మీ అందరికీ హోంమంత్రి పోస్టు రెడిగా ఉందని వైసీపీ పెద్దల నుంచి సంకేతాలు వస్తున్నాయి. అందుకే వీరు ఇలా అతి విశ్వాసం చూపిస్తున్నారు. కానీ తమను బకరాలను చేస్తున్నారని మాత్రం గుర్తించడం లేదన్న సెటైర్లు వైసీపీ నుంచి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరింత మంది వైసీపీ హోంమంత్రులు తెరపైకి వచ్చే చాన్స్ ఉంది.