సోషల్ మీడియా యువతను ఎంతగా బానిసల్ని చేసుకుంటే నేపాల్ లో యువత తిరుగుబాటు నిరూపిస్తోంది. నేపాల్లో సోషల్ మీడియా సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పి.. టిక్ టాక్ మినహా పాతిక వరకూ సోషల్ మీడియా నెట్ వర్కుల్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో యువత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జెన్ జీ యువత పేరుతో అల్లర్లు సృష్టించారు.
సోషల్ మీడియా యాప్స్ నిషేధంతో ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని కూడా ఆరోపిస్తూ పార్లమెట్ లోకి దూసుకెళ్లారు. పార్లమెంట్ లోపలికి చొచ్చుకుపోయారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. చివరికి ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారు వచ్చి యువకుల్నిపిట్టల్ని కాల్చినట్లు కాల్చి పడేశారు. దాంతో పది మంది వరకూ చనిపోయారు. పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. కాల్పులతో ఆందోళనకారులు మోటార్ సైకిళ్లు తగలబెట్టడం, ప్రభుత్వ ఆఫీసులపై దాడులు చేయడంతో పరిస్థితి తీవ్రమైంది.
ఈ ఉద్యమం నేపాల్ చరిత్రలో యువత నేతృత్వంలో జరిగిన అతిపెద్ద ఆందోళనల్లో ఒకటిగా నిలుస్తోంది. సోషల్ మీడియాను ఒక్క సారిగా బ్యాన్ చేయడంతోనే యువత తీవ్ర ఆగ్రహానికి గురైందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకపోతే.. సోషల్ మీడియాకు బానిసలవుతారు. దాన్ని కూడా దూరం చేస్తే.. తిరగబడతారు. ఇప్పుడు నేపాల్లో అదే జరుగుతోంది.