నేపాల్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఉద్యమం చేసి రాజకీయ నేతలు, ప్రధాని సహా అందర్నీ తరిమికొట్టేసిన జెన్-Z యువత ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు నడపాలి..దేశాన్ని సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కించాలన్నది మాత్రం తేల్చుకోలేక కిందా మీదా పడుతున్నారు. ప్రధానిని తరిమికొట్టి పార్లమెంట్ ను సైతం తగులబెట్టిన ఈ ఆందోళనకారులు ప్రజలతో సంబంధం లేకుండా ప్రధానిని డిసైడ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఆ ఉద్యమం నడిపిన వారిలోనూ దీనిపైన ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ప్రధాని పదవికి మూడు వర్గాలు ముగ్గురు పేర్లను ప్రతిపాదించాయి. ఈ ముగ్గురి పేర్లపైనే వాదులాడుకుంటున్నాయి. కానీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
నేపాల్ ప్రధానిపై తలోమాట మాట్లాడుతున్న ఆందోళనకారులు
ఇప్పుడు నేపాల్లో ప్రభుత్వం లేదు.. అధ్యక్షుడు లేడు.. ప్రధాని లేడు. అసలు ప్రభుత్వమే లేదు. దేశంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఏ వ్యవస్థా పని చేయడం లేదు. మిలటరీ కూడా ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉంది. అటు ఆందోళనకారులకు ఇటు.. వారు ప్రతిపాదిస్తున్న ప్రధాని అభ్యర్థులకు మధ్య సైన్యం మధ్యవర్తిత్వం చేస్తోంది. కర్ఫ్యూ విధించి.. పరిస్థితుల్ని కుదుట పరిచే ప్రయత్నం చేస్తోంది. కానీ జెన్-Z ఆందోళనకారులు.. తమలో తాము కొట్లాడుకుంటూ.. దేశాన్ని మరింతగా ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.
తమకు ఇష్టమైన నేతే ప్రధాని కావాలని ఆరాటం
ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ నుంచి పాలకులు వద్దని కొంత మంది అంటున్నారు. ఉన్న వారి నుంచే అవినీతి చేయని వారిని ఎంపిక చేద్దామని మరికొందరంటున్నారు. మొత్తంగా ముగ్గురు పేర్లను ప్రతిపాదించి వారితోనే సర్కస్ ఆడుతున్నారు. గొడవలకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందిని సముదాయించి.. ఎవరో ఒకరిని ప్రధానిని చేసినా వారు సరైన పాలన చేయలేదు. ఈ ఆందోళనకర గ్రూపులు తాము చెప్పినట్లే పాలన చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటాయి. నేపాల్ లో ఈ అరాచకం ఇప్పుడల్లా ముగిసేలా లేదు.
ఎవరు ప్రధాని అయినా పరిస్థితుల్ని మార్చలేరు!
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం యువత తిరుగుబాటు కారణంగా పారిపోయింది. ప్రజలతో సంబంధం లేని ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది. దీని వల్ల జరగబోయే పరిణామాలు .. నేపాల్ ను మరిన్ని సమస్యల్లోకి నెట్టబోతున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి పరిణామాలు చాలా ప్రమాదకరం. ఆందోళనకారులకు అరాచక పరిస్థితుల వల్ల వచ్చిన అధికారం వల్ల చేసే డిమాండ్లను తీర్చడం .. వారు నియమించిన పాలకులకూ సాధ్యం కాదు. మొత్తం నేపాల్ ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది