వైసీపీ హయాంలో అసంబద్ధంగా జరిగిన జిల్లాల విభజన, వివాదాలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కమిటీని నియమించింది. కొన్ని జిల్లాల పేర్ల మార్పు , కొన్ని నియోజకవర్గాలను పొరుగు జిల్లాలలో విలీనం చేసే ప్రతిపాదనలపై చర్చలు జరుపుతోంది. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
జిల్లాల సరిహద్దులు, నియంత్రణ , చట్టపరమైన అంశాలు, ఆస్తులు, సిబ్బంది, సమాచార సాంకేతికత వంటి అంశాలను పరిశీలించడానికి నాలుగు సబ్-కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య 26 నుండి 30 లేదా అంతకంటే ఎక్కువకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం డిమాండ్లు ఉన్నాయి. హిందూపురం, రాజంపేట, మార్కాపురం వంటి ప్రాంతాలను జిల్లాలుగా చేయాలన్న విజ్ఞప్తులు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు పేర్ల మార్పు డిమాండ్లు ఉన్నాయి.
గతంలో ఏర్పాటు చేసిన జిల్లాల్లో ప్రధాన కార్యాలయాలు చాలా దూరంగా ఉన్నాయి. పాడేరు, అరకు వంటి చోట్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని విమర్శలు వచ్చాయి. సీలేరు నుండి అరకు వెళ్లడానికి 5-7 గంటలు పడుతుంది. పోలవరం గిరిజన ప్రాంతాలతోనే ఓ జిల్లాను ఏర్పాటు చేసి గిరిజనలకు అందుబాటులో జిల్లా కేంద్రం పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది. గతంలో టీడీపీ హామీ కూడా ఇచ్చింది. వీటిపై నెల రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.