టికెట్ ధరల పెంపువల్లే థియేటర్లకు జనం రావట్లేదని ఓ వర్గం బలంగా వాదిస్తోంది. అతి చవకైన వినోద సాధనం సినిమా మాత్రమే, ఈ రేట్లు కూడా భరించలేకపోతే ఎలా? అని నిర్మాతలు వాదిస్తున్నారు. `మంచి సినిమా వస్తే రేటు ఎంతన్నది పట్టించుకోరు` అని ఇంకో వర్గం ధీమాగా చెబుతోంది. ఎవరి వాదనలు వాళ్లవి. అయితే మధ్యమధ్యలో నిర్మాతలు కొన్ని ప్రయోగాలూ చేస్తున్నారు. ఆమధ్య విడుదలైన `రాజు వెడ్స్ రాంబాయి` సినిమా టికెట్ ని రూ.99 లకే అందుబాటులో తెచ్చారు నిర్మాతలు. అది కాస్త వర్కవుట్ అయినట్టే కనిపించింది. ఇప్పుడు `మోగ్లీ` టీమ్ కూడా అదే బాట పడుతోంది. ఈనెల 13న `మోగ్లీ` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధర 99 రూ.గా నిర్మాత నిర్ణయించుకొన్నారు. ఓరకంగా ఇది కూడా ప్రయోగమే. `మోగ్లీ` మరీ చిన్న సినిమా కాదు. బాగానే ఖర్చు పెట్టారు. ఈ రేంజ్ సినిమా టికెట్ రేట్ కూడా 99 రూ.లకే నిర్ణయించడం ఆలోచించదగిన విషయం.
పెద్ద సినిమాలొస్తున్నప్పుడు రేట్లు ఎలాగూ పెంచుకొంటున్నారు కదా, చిన్న సినిమాలు తీస్తున్నప్పుడు కాస్త తగ్గించండి అని వాదించే వాళ్లకు ఈ రేట్లు ఉపశమనం కలిగిస్తాయి. `మోగ్లీ` ఫుట్ ఫాల్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మిగిలిన నిర్మాతలు చాలా ఆసక్తిగా గమనించే అవకాశం ఉంది. 99 రూపాయల స్కీమ్ కి ప్రేక్షకులు ఎట్రాక్ట్ అయితే మిగిలిన సినిమాలూ ఇదే పంథా అనుసరించే అవకాశం ఉంది. ఓరకంగా ఇది కేస్ స్టడీ అనుకోవాలి. వీకెండ్ లో ఓ రేటు, వీక్ డేస్ లో మరో రేటు పెట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. శని, ఆదివారాలు క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. సోమవారం నుంచి గురువారం వరకూ థియేటర్ల దగ్గర తాకిడి చాలా తగ్గిపోతోంది. అందుకే ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి పెద్ద సినిమాలు సైతం స్లాబ్ సిస్టం అనుసరిస్తే బాగుంటుందన్న సలహాలు సినిమా పెద్దలు ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఎవరూ ఆచరణలో పెట్టలేదు. 99 రూపాయల ఆలోచనతో నిర్మాతల వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కూడా జనం రాకపోతే… ఫుట్ ఫాల్స్ తగ్గడానికి వేరే బలమైన కారణాలు ఉన్నాయన్న సంగతి అర్థం చేసుకోవాలి.
