మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో భారీ ఊరట లభించింది. మూసీ నది పునరుజ్జీవన పనులను సవాల్ చేస్తూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ వెనుక ఎటువంటి పర్యావరణ ఆందోళన లేదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే దీనిని వేశారని ప్రభుత్వం గట్టిగా వాదించింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్, ఈ పిటిషన్ నిలవదని తేల్చిచెప్పింది.
ఈ వివాదం వెనుక ఆసక్తికరమైన రాజకీయ కోణం కూడా ఉంది. ఇటీవల మంచిరేవుల వద్ద దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పిటిషన్పై తీవ్రంగా స్పందించారు. పిటిషనర్ కార్తీక్ రెడ్డి తల్లి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి సొంత మనుషుల చేతే కేసులు వేయించడం సరికాదు అని పేర్కొంటూ, ఆ పిటిషన్ను వెంటనే వెనక్కి తీసుకోమని సూచించారు. లేదంటే ప్రజల నుండి సామాజిక బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండానే పిటిషన్ ను ఎన్జీటీ కొట్టి వేసింది.
మూసీ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కోర్టుల ద్వారా ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే శివతాండవం అనే పదాన్ని ప్రయోగిస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే గుణపాఠం చెబుతారని రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడు NGT తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో, అటు రాజకీయంగా, ఇటు న్యాయపరంగా కాంగ్రెస్ సర్కార్ పైచేయి సాధించినట్లయింది. ప్రస్తుతం ఈ తీర్పుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. 200 ఎకరాల్లో ప్రతిపాదించిన గాంధీ సరోవర్ . మూసీ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులు ఇక వేగవంతం కానున్నాయి.


