సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఇప్పుడు వెండి తెరపైకి ఎంట్రీ ఇస్తోంది. బన్నీ వాస్ నిర్మించిన ‘మిత్రమండలి’లో తనే కథానాయిక. తమిళంలో ఇది వరకే ఓ సినిమా చేసింది. ‘పెరుసు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే అది ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు తెలుగులోకి దూకింది. ‘మిత్రమండలి’ లాంటి కథలో ఏ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకొన్నా పెద్దగా ఫరక్ పడదు. కానీ నిహారిక లాంటి సోషల్ మీడియా సెలబ్రెటీని తీసుకురావడం వల్ల కాస్త క్రేజ్ వచ్చింది. ఈసినిమా గురించి, ఈ అమ్మాయి గురించి కాస్త మాట్లాడుకొంటున్నారు. బన్నీ వాస్ ఆలోచన కూడా అదే. ఎవరినో ఒకరిని తీసుకోవడం బదులు, కాస్త పాపులారిటీ ఉన్న నిహారిక లాంటి వాళ్లని ఎంచుకొంటే పబ్లిసిటీకి బాగా ఉపయోగపడుతుందని అనుకొన్నారు. పైగా నిహారిక పబ్లిసిటీలో మాస్టర్. కొన్ని సినిమాలకు తాను చేసిన స్కిట్లు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ‘మేజర్’ కోసం మహేష్ బాబు, అడవిశేష్లతో కలిసి ఓ ప్రోమో చేసింది. అది బాగా పేలింది. పక్క సినిమాకే ఇన్ని చేసుకొంటే, తన సొంత సినిమాకు ఇంకెన్ని చేసుకోవాలో కదా..? కానీ నిహారిక విషయంలో `మిత్రమండలి`ని లైట్ తీసుకొందేమో అనిపిస్తోంది.
చిత్రబృందం ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాలు పంచుకోవడం మినహా.. నిహారిక కొత్తగా చేసిందేం లేదు. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో మౌళి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాను కూడా నిహారికలా సోషల్ మీడియా స్టారే. తన స్ట్రాటజీని బాగా వాడాడు కూడా. సోషల్ మీడియా ద్వారా తాను ఈ సినిమాకి ఎంత చేయగలడో అంతకంటే ఎక్కువే చేశాడు. దాంతో సినిమాపై విడుదలకు ముందే ఓ బజ్ ఏర్పడింది. అది సినిమా ఓపెనింగ్స్‌కి బాగా ఉపయోగపడింది. కానీ… ‘మిత్రమండలి’ విషయంలో అదేం జరగడం లేదు. బన్నీ వాస్ ఏ ఆలోచనతో ఈ సినిమాలో నిహారికని తీసుకొన్నాడో, ఆ ఆలోచన, ఆ లక్ష్యం నెరవేరడం లేదు. నిహారిక కావాలనే ఈ సినిమాని పట్టించుకోవడం లేదా, లేదంటే.. చిత్రబృందమే నిహారికని వాడుకోవడం లేదా అనేది కూడా అర్థం కావడం లేదు. బన్నీ వాస్ ప్రమోషనల్ స్ట్రాటజీలు బాగుంటాయి. ఆయన ఉండి కూడా… నిహారిక అనే ట్రంప్ కార్డ్ ని వాడుకోకపోవడం విచిత్రమే.