నితిన్ ని ప‌క్క‌న పెట్టేశారేంటి చెప్మా?

Nithiin
Nithiin

‘శ్రీ‌నివాస క‌ల్యాణం’ ఎవ‌రి సినిమా?
– దిల్ రాజు సినిమా
– స‌తీష్ వేగ్నేశ సినిమా..

ప్ర‌స్తుతం ఈ సినిమాని ఇలానే ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి నితిన్ ఏమైపోయాడ‌న్న‌ది అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌. నితిన్ పేరు లేకుండానే ప్ర‌చారం జ‌రిగిపోతోంది. రేపే శ్రీ‌నివాస క‌ల్యాణం రిలీజ్‌.. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ప్రింట్, ఎలక్ట్రానిక్‌, వెబ్ మీడియాల్లో నితిన్ ఇంట‌ర్వ్యూ లేదు. రేజులో ఉన్న యువ హీరోల్లో నితిన్ ఒక‌డు. ‘అ.ఆ’తో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌నీ భ‌లేగా ఆక‌ట్టుకున్నాడు. అంత‌కు ముందు కూడా త‌న కెరీర్‌లో హిట్లు, సూప‌ర్ హిట్లు ఉన్నాయి. అయితే వ‌రుస‌గా రెండు దెబ్బ‌లు తిన్నాడు. ‘ఛ‌ల్ మోహ‌న రంగ‌’ ‘లై’ దారుణంగా నిరాశ ప‌రిచాయి. అందుకే నితిన్‌ని సైడ్ చేసేశార‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆడియో ఫంక్ష‌న్లో కూడా నితిన్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా మాట్లాడాడు దిల్‌రాజు. ‘మా ఇంటికొచ్చి.. సినిమా చేయ‌మ‌ని బ‌తిమాలాడు’ అన్న టోన్‌లో దిల్‌రాజు స్పీచ్ వినిపించేస‌రికి అటు నితిన్ కూడా షాక్ తిన్నాడు. ఈ సినిమా నితిన్ కెరీర్‌కి చాలా అవ‌సరం. పారితోషికం కూడా తీసుకోకుండా ఈ సినిమాకి ప‌నిచేసిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. దానికి కార‌ణం… క‌థ అంత‌గా న‌చ్చ‌బ‌ట్టే. ఈ సినిమా హిట్ట‌యితే… కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డుతుంది. కానీ దిల్‌రాజు ఆ అవ‌కాశం ఇచ్చేలా క‌నిపించ‌డం లేదు. ‘ఇది దిల్‌రాజు సినిమా’ అనే బ్రాండ్‌తోనే ఈ సినిమా ప్ర‌మోష‌న్లు సాగుతున్నాయి. సినిమా హిట్ట‌యితే.. వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌కో… లేదంటే స‌తీష్ వేగ్నేశ‌కో మైలేజీ వెళ్లిపోయేలా ఉంది త‌ప్ప‌.. నితిన్‌కి క్రెడిట్ వ‌స్తుందా? రాదా? అనిపిస్తోందిప్పుడు. ఈ విష‌యంలో నితిన్ కూడా… ఆందోళ‌న చెందుతున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com