రివ్యూ : లై

తెలుగు360.కామ్ రేటింగ్ 2.25/5

ఒక్కోసారి కొన్ని తెలుగు సినిమాలు చూస్తుంటే, బాంఢ శుద్ధి లేని పాకమదియేల అన్న సామెత గుర్తుకు వుస్తుంది. చిత్రమేమిటంటే మన తెలుగు సినిమాలది ఈ సామెతతో పోల్చుకుంటే కాస్త రివర్స్ వ్యవహారం. ఇక బాంఢం అదేనండీ గిన్నె ఆకారం బాగానే వుంటుంది, అందులో పెట్టడానికి వండే వంటే సరిగ్గా కుదిరి చావదు. పైగా మన సినిమా జనాలు ముందుగు వడ్డించే గిన్నె కు ఇచ్చిన ప్రయారిటీ వడ్డించబోయే సరుకుకు ఇవ్వరు. దాంతో పాత్రను చూసి ముచ్చటపడి రుచి చోడబోతే, విషయం నోటికి చేదుగా తగుల్తుంది. ఇదంతా ఈ వారం విడుదలయిన లై సినిమా గురించే. కండలు తిరిగిన విలన్ గంభీరంగా నడచి వస్తుంటే, నేపథ్యంలో మణిశర్మ మ్యూజిక్ వినిపిస్తుంటే, నితిన్ కొత్తగా కనిపిస్తుంటే ట్రయిలర్ అద్దిరిపోయింది బాసూ అనుకున్నారు అంతా. లవ్, ఇంటిలిజెన్స్, ఎనిమిటి అనగానే ఏ రేంజ్ లో వుంటుందో అని లొట్టలు వేస్తూ రెడీ అయిపోయారు. కానీ తీరా వడ్డన పూర్తయ్యాక తెలిసింది. డెకరేషన్ హడావుడి ఎక్కువ.విషయం తక్కువ అని.

వెనకటికి ఎవడో ముక్కు ఏది అని అడగ్గాన, తల చుట్టూ చేయి తిప్పి ముక్కు మీద వేలు పెట్టుకున్నాడట. అలాగ్గా వుంటుంది లై సిన్మా కోసం హను రాఘవపూడి తయారు చేసుకున్న స్క్రిప్ట్ వ్యవహారం.

కథ

మేరేజెస్ మేడిన్ హెవెన్ అన్నది ఇప్పటికీ అవునా కాదా అనే పిచ్చి సందేహం నారదుడికి. దానిని పనిగట్టుకుని భూలోకం వచ్చి మరీ ప్రూవ్ చేయాలన్న పిచ్చి తపన దేవేంద్రుడికి. దాంతో వాళ్లు భూమ్మీదకు వస్తారు. అప్పుడు హీరో ఎ సత్యం(నితిన్) హీరోయిన్ చైత్ర (మేఘా ఆకాష్) భూమ్మీద పడతారు. చైత్ర గురించి ఎల్ కే జి నుంచి పెళ్లి వయసు దాకా సుదీర్ఘ ఉపోద్ఘాతం. ఇక అ.సత్యం గురించి కూడా డిటో డిటో.

ఈ కథ ఇలా వుంటే ది గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ ను ఆఖరి సారిగా తెలిసిన ఏకైక వ్యక్తి పద్మనాభన్ (సీనియర్ అర్జున్). ప్రేక్షకులకు మాత్రమే తెలిసి, పోలీసులకు తెలియనిది ఏమిటంటే తాము వెదుకుతున్న నొటోరియస్ క్రిమినల్ అతగాడే అన్నది. అతన్ని పట్టుకొవాలంటే, పద్మనాభన్ ముచ్చటపడి హైదరాబాద్ పాత బస్తీలో కుట్టించుకుంటున్న సూట్ ను ఫాలో అవ్వాలి. అందుకోసం ఓ ఇంటిలిజెన్స్ అధికారి (శ్రీరామ్) ను నియమిస్తారు. అదే సమయంలో చైత్ర, సత్యం కూడా అమెరికా చేరతారు. ఇలా అన్ని పాత్రలు ఒకే చోట చేరి, ఒకే విషయంతో అనుకోకుండానో, అనుకునో ముడిపడాయి.

అప్పుడు ఏం జరిగింది అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ

దర్శకుడు హను రాఘవపూడికి దృశ్యాల టేకంగ్ లో ఊహాశక్తి అద్భుతంగా వుంది. కానీ వాటికి సరిపడా కథ, కథనాలను పకడ్బందీగా తయారుచేసకోవడం లో మాత్రం సత్తా లేదనిపిస్తుంది లై సినిమా చూస్తే. మూడు జోనర్లను ముడిపెట్టి సినిమా తీద్దామనుకున్నపుడు దర్శకుడికి ఎదురయ్యే సమస్య నిడివి. అమ్మో..మూడు జోనర్ల వైనాలు ముడిపెట్టాలి. అలా అని వీలయినంత క్లుప్తంగా చెప్పాలి? ఎలా అని ఆలోచించాలి. కానీ సినిమా చూస్తే, నిడివిని విస్తారంగా ఇష్టానుసారం వాడేసినట్లు కనిపిస్తుంది. ఎంత ఇష్టానుసారం అంటే, అసలు చైత్ర చిన్నప్పటి వ్యవహారాలు కానీ, ఎ.సత్యం అన్న పేరు, అతగాడి ఫ్యామిలీ వ్యవహారాలు కానీ వున్నా, లేకపోయినా ఒకటే. వృధా ఫ్రేమ్ లు, వృధా ఖర్చు మినహా మరేమీ కాదు. పెయింటింగ్ ను చేతితో వేసాడు. వేలి ముద్రలు పడ్డాయి. దాన్ని అలా కావాల్సిన వాళ్లకు ఇచ్చేస్తే పోలా? రెండు వేల కోట్లు వాటి కోసం ఆఫర్ చేసే వాళ్లు ఆ మాత్రం వేలి ముద్రలు దాని మీంచి తీసుకునే టెక్నాలజీని తెచ్చుకోలేరా?

పైగా పెయింటింగ్ విలన్ దగ్గరే వుందా? అక్కడే వేలి ముద్రలు తీయించారా? మళ్లీ దాన్ని ఇండియాకు పంపి సూట్ చేయించడం ఎందుకు? దాన్ని వెనక్కు రప్పించడానికి నానా పాట్లు పడడం ఎందుకు? ఇవన్నీ స్టోరీలో లాజిక్ మిస్సింగ్ లు. ఇక టేకింగ్ మిస్సింగ్ లు చూద్దాం. విలన్ ఎవడు? ఇది అసలు సిసలు ప్రశ్న. వాడికి ఆ బిల్డప్ ఏమిటి? వాడిని 19 ఏళ్లుగా ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు? ఏమైనా వీసమెత్తు వివరించారా? ఎంతసేపూ విలన్ దాక్కోవడానికి చూస్తుంటాడు. హీరో కోటు దాచుకోవడానికి చూస్తుంటాడు. అంతకన్నా విషయం ఏముంది? హీరో రూమ్ లో బగ్స్ పెట్టి విలన్ సాధించేదిమిటి? వాటిని ఎంత ఎఫెక్టివ్ గా రివీల్ చేయాలి. కావాలంటే దర్శకుడు ఓసారి ధృవ సినిమా చూడడం బెటర్.

సరే థ్ర్రిల్లర్ జోనర్ కు అతికిద్దాం అని చూసిన ప్రేమ కథ సంగతేమిటి? ఆ పిల్లేమిటి? క్యారెక్టర్ ఏమిటి? ఏమైనా చేసావా? ప్రొటెక్షన్ వాడావా? సరే, ఈ సంగతులు వదిలేద్దాం. అసలు వాళ్లిద్దరి మధ్య అబద్దాలు ఆడించే స్కీమ్ వల్ల ప్రయోజనం ఏమైనా వుందా? ఏదో కొత్తగా ట్రయ్ చేసాం అన్న సంతృప్తి కోసం తప్ప.

అసలు థ్రిల్లర్, ఇంటిలిజెన్స్ జోనర్ సినిమాలు తీసేటపుడు కథనం ఎంత షార్ప్ గా వుంటే అంత మంచింది. సోది అన్నది అస్సలు పనికిరాదు. కానీ లై సినిమాలో అదే ఎక్కువ వుంది. కథతో సంబంధం లేని విషయాలు నిర్మొహమాటంగా నరగడం ప్రారంభిస్తే, పావు వంతుకు పైగా సినిమా లేచిపోతుంది. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేవి విలన్ కు హీరో కు మధ్య మైండ్ గేమ్ కు సంబంధించినవి. వాటిని బలంగా, విస్తారంగా రాసుకునే సత్తా కరువైనట్లు అనుకోవాలి. ఎందుకంటే అవి ఎక్కువగా లేవు కాబట్టి. లవ్, థ్రిల్లర్ జోనర్లు రెండింటిని కలిపినపుడు రెండు తరహా ప్రేక్షకులను సంతృప్తి కలిగించే విధమైన స్క్రిప్ట్ తయారుచేసుకోవడం అత్యవసరం. లేదూ అంటే ఇటు వెజ్ వాళ్లనీ సంతృప్తి పర్చక, అటు నాన్ వెజ్ వాళ్లనీ సంతృప్తి పర్చక, అరకొర వడ్డన సాగించినట్లు అవుతుంది సినిమా వ్యవహరం. లై సినిమా సంగతి అచ్చంగా ఇదే.

నటీనటుల ప్రతిభ

ఈ సినిమాలో నితిన్ మేకోవర్ బాగుంది. అతని నటనలో మాంచి మెచ్యూరిటీ కూడా కనిపించింది. మేఘా ఆకాష్ క్యూట్ గా అందంగా వుంది. ఆమెకు మరి కొన్ని సినిమాలు అయితే వచ్చే అవకాశం వుంది. సీనియర్ అర్జున్ కు కొత్తగా కితాబు ఇచ్చేదేముంది? రవికిషన్ ఈ తరహా పాత్రలో కొత్తగా కనిపించాడు.

సాంకేతికత

సినిమాకు మణిశర్మ నేపథ్య సంగీతం, యువరాజ్ చాయాగ్రహణం ప్రాణం పోసాయి. మణిశర్మ మంచి ఆర్ ఆర్ ఇస్తారని ఇండస్ట్రీలో పేరుంది. ఆ పేరును మరింత పదిలం చేస్తుంది ఈ సినిమా. పాటలు ఓకె. తెలంగాణ స్లాంట్ లో సాగే పాటకు ప్లేస్ మెంట్, డ్యాన్స్ మూవ్ మెంట్స్ రెండూ సరిగ్గా కుదరలేదు. డైలాగులు అక్కడక్కడ ఓకె.

ఫైనల్ టచ్..తడి తక్కువ.తమాషా ఎక్కువ అన్నట్లు బిల్డప్ లు ఎక్కువ, విషయం తక్కువ..ఈ లై సినిమాలో

తెలుగు360.కామ్ రేటింగ్ 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com