నితిన్ కెరీర్ డోలాయమానం స్థితిలో వుంది. ఎలాంటి కథ చేసినా ప్రేక్షకులు రిజక్ట్ చేస్తున్నారు. రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలకైతే.. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇటీవలే కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించాడు. అది మినహాయిస్తే కొత్త కథలేం ఒప్పుకోలేదు. ఇది వరకు నితిన్ దగ్గరకు వెళ్లిన కొన్ని కథలు కూడా ఇప్పుడు యూ టర్న్ తీసుకొని, వేరే హీరోల చేతుల్లో పడుతున్నాయి. విక్రమ్ కె.కుమార్ కూడా నితిన్ కోసం ఓ స్క్రిప్టు సిద్దం చేసుకొన్నాడు. ‘ఇష్క్’ కాంబో కాబట్టి, నిర్మాతలు కూడా రెడీ అయ్యారు. కానీ నితిన్ వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఇప్పుడు ఈ కథ.. చేతులు మారి, విజయ్ దేవరకొండ దగ్గరకు చేరిందని తెలుస్తోంది.
ఇటీవల విజయ్ దేవరకొండ – విక్రమ్ మధ్య చర్చలు నడిచాయి. విక్రమ్ తో పని చేయడానికి విజయ్ సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే… రెమ్యునరేషన్, ఇతర లెక్కలు తేలాల్సివుంది. అన్నీ కుదిరితే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తుంది. గుర్రపు స్వారీల నేపథ్యంలో సాగే కథ ఇది. ‘స్వారీ’ అనేటైటిల్ పరిశీలిస్తున్నారు. అన్నీ కుదిరితే.. ఈ యేడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. విజయ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ‘రౌడీ జనార్థన’, ‘రణబాలి’ సెట్స్ పై ఉన్నాయి. ఇవి రెండూ పూర్తయ్యాకే… విక్రమ్ సినిమా మొదలవుతుంది.
