నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయింది. ‘తమ్ముడు’ కూడా నితిన్‌కి స్వాంతన ఇవ్వలేకపోయాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు యునానిమస్ గా ఫ్లాప్ టాక్ వచ్చింది. భీష్మ తరవాత నితిన్‌కి హిట్ లేదు. చెక్, మాచర్ల నియోజక వర్గం, ఎక్స్ ట్రా, రాబిన్ హుడ్ ఇలా అన్నీ ఫ్లాపులే. మధ్యలో వచ్చిన ‘రంగ్ దే’ యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోయింది. ‘తమ్ముడు’ రూపంలో నితిన్ ఓ కొత్త జోనర్ టచ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ సినిమాతో నితిన్ కెరీర్ డోలాయమాన స్థితికి చేరుకొంది.
నితిన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ‘ఎల్లమ్మ’ ఒకటి. ‘తమ్ముడు’ రిజల్ట్ తరవాత ‘ఎల్లమ్మ’ ముందుకు సాగుతుందా, లేదా? అనేది అనుమానం రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకీ నిర్మాత దిల్ రాజునే. తమ్ముడు ఫ్లాప్ అయ్యాక.. నితిన్ తో దిల్ రాజు మళ్లీ ఆ సాహసం చేస్తారా? అనేది డౌట్. ‘ఎల్లమ్మ’కు వేణు ఎల్దిండి దర్శకుడు. ‘బలగం’ సినిమా తరవాత వేణు చేస్తున్న సినిమా ఇది. ముందు నానిని హీరోగా అనుకొన్నారు. ఆ తరవాత నితిన్ దగ్గరకు వచ్చి ఆగింది. ‘బలగం’లా ఇది తక్కువ బడ్జెట్ లో అయిపోయే సినిమా కాదు. కాస్త గట్టిగానే ఖర్చు పెట్టాలి. నితిన్ పై ఇది వర్కవుట్ అవుతుందా? అనే ఆలోచనల్లో దిల్ రాజు ఉన్నట్టు సమాచారం. ‘తమ్ముడు’ సినిమాకు నితిన్ పారితోషికం ఏం తీసుకోలేదు. సినిమా హిట్టయితే లాభాల్లో వాటా పంచుకొంటామన్న షరతుతో సినిమా మొదలైంది. అలా చేసినా.. ‘తమ్ముడు’ ఆర్దికంగా గట్టెక్కలేదు. ‘ఎల్లమ్మ’ని కూడా ఇదే పంథాన మొదలెట్టినా… సినిమా అటూ ఇటు అయితే ‘తమ్ముడు’లానే తయారవుతుంది. అందుకే దిల్ రాజు ఏం చేస్తారు? ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా, వెళ్తే నితిన్ హీరోగా ఉంటాడా? అనే సవాలక్ష అనుమానాలు వెంటాడుతున్నాయి. దిల్ రాజు కూడా ‘తమ్ముడు’ రిజల్ట్ తరవాత ‘ఎల్లమ్మ’ని పట్టాలెక్కిద్దామని ఇన్నాళ్లూ ఆగారు. ఇప్పుడు ఫలితం అర్థమైంది. తరువాతి స్టెప్ ఏమిటన్నది దిల్ రాజు చేతుల్లో వుంది.