రాష్ట్రప‌తి ఎన్నిక‌తో భాజ‌పాకి నితీష్ చేరువ‌!

సామ దాన భేద దండోపాయాల‌ను ఉప‌యోగించి దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను కాషాయ‌మ‌యం చేయాల‌న్న ల‌క్ష్యంతో భార‌తీయ‌ జ‌న‌తా పార్టీ ఉంద‌నేది తెలిసిందే. రాష్ట్రప‌తి ఎన్నిక సంద‌ర్భంగా వివిధ రాష్ట్రాల్లో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీయేకి చేరువ‌య్యే దిశ‌గా అడుగులు వేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌లో భాజ‌పా అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ కు నితీష్‌ మ‌ద్ద‌తు ప‌లికి విప‌క్షాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రచిన సంగ‌తి తెలిసిందే. విప‌క్షాల భేటీలో కూడా ఇదే అంశంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జరిగింది. కోవింద్ కు నితీష్ మ‌ద్ద‌తు తెల‌ప‌డం వెన‌క వేరే వ్యూహం ఉంద‌ని అర్థ‌మౌతోంది.

బీహార్ లో ప్ర‌స్తుతం ఆర్జేడీ కూడా ప్ర‌భుత్వ భాగ‌స్వామి ప‌క్షం అనే విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌స్తుతం ఆ పార్టీతో ఉన్న స్నేహ‌బంధాన్ని నితీష్‌ త్వ‌ర‌లోనే తెగ‌తెంపులు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే, ఆర్జేడీ చ‌ర్య‌ల వ‌ల్ల త‌మ ప్ర‌భుత్వం అప్ర‌తిష్ట పాలౌతోంద‌ని నితీష్ భావిస్తూ వ‌స్తున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే.. నితీష్ కు భాజ‌పా మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంది. అందుకే, ఈ మ‌ధ్య భాజ‌పాపై విమ‌ర్శ‌ల్ని క్ర‌మంగా త‌గ్గించేశారు. అంతేకాదు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నిర్ణ‌యాల‌ను పొగ‌డ‌టం కూడా ప్రారంభించారు. ఒక‌వేళ ఆర్జేడీని దూరం చేసుకున్నా… భాజ‌పా మ‌ద్ద‌తుతో అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌న్న‌ది నితీష్ కుమార్ వ్యూహం.

భాజ‌పాకి చేరువ కావాలంటే కాంగ్రెస్ తోపాటు ఇత‌ర విప‌క్షాలకు కూడా దూర‌మౌతున్న‌ట్టు సంకేతాలు ఇవ్వాలి. గ‌త కొంత కాలంగా నితీష్ కుమార్ అదే ప‌నిచేస్తున్నారు. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ఎంపిక విష‌య‌మై గ‌త నెల‌లో విప‌క్షాల‌న్నీ స‌మావేశ‌మ‌య్యాయి. సోనియా గాంధీ అధ్య‌క్ష‌త వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి నితీష్ హాజ‌రు కాలేదు. ఆ త‌రువాత‌, ప్ర‌ధాని మోడీ ఇచ్చిన ఓ విందు కార్య‌క్ర‌మానికి నితీష్ వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. సో.. విప‌క్షాలు ప్ర‌తిపాదించే రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి నితీష్ మ‌ద్ద‌తు ఉండ‌ద‌నేది అప్పుడే స్ప‌ష్ట‌మైపోయింది. ఎలాగూ భాజ‌పా మ‌ద్ద‌తు అవ‌స‌రం కాబ‌ట్టి… ఒక‌వైపు భాజ‌పా రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇచ్చి, మ‌రోవైపు రాష్ట్రంలో త‌మ‌కు అండ‌గా నిల‌వాల‌ని నితీష్ భాజ‌పాతో డీల్ కుదుర్చుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. బీహార్ విష‌యంలో భాజ‌పా, ఆర్జేడీకి దూరంగా జ‌రిగే క్ర‌మంలో నితీష్ కుమార్.. ఇలా రాష్ట్రప‌తి ఎన్నిక‌ను ఎవ‌రికివారు అనుకూలంగా మార్చుకుని, రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందుతున్నార‌న్న‌ది వాస్త‌వం!

నిజానికి, భాజపాకి చేరువ కావాల‌న్న తాప‌త్ర‌యం ఉన్న పార్టీల‌న్నీ ఈ ఎన్నిక‌లో త‌మ మ‌ద్ద‌త‌ను ప్ర‌క‌టించ‌డం ద్వారా స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఆంధ్రాలో అధికార విప‌క్షాలు రెండూ పోటీ ప‌డి మ‌రీ ఎన్డీయే అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం విశేషం. ఇక‌, తెలంగాణ‌లో అధికార పార్టీ తెరాస కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏతావాతా ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఆశిస్తున్న‌ది ఇదే… రాష్ట్రాల‌న్నీ కేంద్రంవైపు చూడాలీ, కేంద్రంలోని అధికార పార్టీల‌పైనే ఆధార‌ప‌డాలి! అన్ని రాష్ట్రాల్లోనూ భాజ‌పా హ‌వా న‌డ‌వాలి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com