బీహార్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. స్వీప్ అనే మాట చిన్నది. ఎందుకంటే ఇరవై ఏళ్లుగా సీఎంగా ఉంటున్న నితీష్ కుమార్ ను మరోసారి సీఎంగా ఎన్నుకున్నారు అక్కడి ప్రజలు. మధ్యలో ఓ సారి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తేడాగా వచ్చాయని పదవి నుంచి తప్పుకుని జితన్ రామ్ మాంఝీకి అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ సీఎం పదవి చేపట్టారు. అదొక్కటి మినహా అన్ని ఏళ్లూ ఆయనే సీఎం.
బీహార్లో శాంతిభద్రతల సమస్యను కొంత వరకూ పరిష్కరించారు కానీ..అభివృద్ధి చేసిందేమీ లేదు. పెద్ద ఎత్తున బీహార్ ప్రజలు ఇప్పటికీ వలస పోతూంటారు. అయినా సరే ఆయనకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో నాలుగైదు సీట్లు మాత్రమే మెజార్టీకి కావాల్సినంతగా ఎక్కువగా సంపాదిచిన కూటమి ఈ సారి మాత్రం 200కుపైగా సీట్లను సాధించింది. ఇంతటి విజయాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. బీహార్ లో ఎన్డీఏ ఈ సారి ఓడిపోతుందని అనుకున్నారు. కానీ పాజిటివ్ వేవ్ చూసి రాజకీయ పార్టీలుకూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.
బీహార్ పూర్తిగా కులాల సమీకరణాలతో రాజకీయం చేసే రాష్ట్రం. అక్కడే బీజేపీ, కూటమి కుల సమీకరణాలను పక్కాగా లెక్కలేసి రంగంలోకి దిగింది. బీజేపీకి ఉండే అగ్రవర్ణాల మద్దతు.. నితీష్ కు ఉండే ఈబీసీల సపోర్ట్.. ఎల్జేపీకి ఉండే దళితుల మద్దతుతో తిరుగులేని విజయాలు సొంతమయ్యాయి. బీహార్ ఎన్నిక విజయం ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్టడీ అవుతుంది.


