బీహార్ రాజకీయాల్లో సుశాసన్ బాబుగా పేరు తెచ్చుకున్న నితీష్ కుమార్, తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఆయన తన కుమారుడు నిశాంత్ కుమార్ను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారనే వార్త బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నిశాంత్ జేడీయూ పార్టీలో అధికారికంగా చేరతారని, ఆయనకు రాజ్యసభ సీటు లేదా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆ పార్టీ మంత్రులు శ్రవణ్ కుమార్, అశోక్ చౌదరి చేసిన ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
నితీష్ సిద్ధాంతం – మారుతున్న సమీకరణాలు
ఇప్పటి వరకు నితీష్ కుమార్ తన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తన కుమారుడిని అధికారిక కార్యక్రమాలకు , రాజకీయాలకు దూరంగా ఉంచారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై ఆయన చేసే ప్రధాన విమర్శే వారసత్వ రాజకీయం. అయితే, 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు, నితీష్ కుమార్ వయస్సు రీత్యా పార్టీని నడిపించే నమ్మకమైన వారసుడు అవసరమనే భావన జేడీయూలో బలంగా వినిపిస్తోంది. ఈ కారణంగానే నిశాంత్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.
నిశాంత్ కుమార్ – పార్టీ శ్రేణుల ఆశలు
49 ఏళ్ల నిశాంత్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. ఆయనకు రాజకీయాల కంటే ఆధ్యాత్మికత , సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువని గతంలో సన్నిహితులు చెప్పేవారు. కానీ, గత ఏడాది కాలంగా ఆయన నితీష్ కుమార్ వెంట బహిరంగ సభల్లో, పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తుండటం గమనార్హం. నిశాంత్ కుమార్ రూపంలో నితీష్ కుమార్ ప్రతిబింబాన్ని చూస్తున్నాం అని జేడీయూ నాయకులు ఇప్పటికే పొగడ్తలు ప్రారంభించారు. పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇది నితీష్ కుమార్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం కాదని పార్టీ నేతలు సమర్థించుకుంటున్నారు.
విపక్షాల విమర్శలు
నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఇన్నాళ్లూ వారసత్వ రాజకీయాలను తిట్టిన నితీష్, ఇప్పుడు తన కుమారుడిని తీసుకురావడం ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని ఆర్జేడీ, ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. జేడీయూలో నితీష్ తర్వాత సరైన నాయకత్వం లేకపోవడం, పార్టీని చీలికల నుండి కాపాడుకోవడానికి తన కుమారుడినివారసుడిగా ప్రకటించడం తప్ప ఆయనకు మరో మార్గం లేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.


