రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగూ గెలిచే అవకాశం ఉండదు…తెలంగాణాలో మాత్రం కచ్చితంగా గెలవాలన్న ఉద్ధేశ్యంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా-సీమాంధ్రల మధ్య పంపకాలు చేసింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కి అన్నీ మాటలు చెప్పారు. తెలంగాణాకు వనరులు ఇచ్చారు. బిజెపి, టిడిపి పార్టీలకు కూడా తెలంగాణాలో ఓట్లు, సీట్లు కూడా ముఖ్యమయిపోవడంతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది. కాంగ్రెస్, బిజెపి, టిడిపి నాయకుల రాజకీయ స్వార్థం తెలంగాణాకు భలే కలిసొచ్చింది. అయితే అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్‌కి తెలంగాణా ప్రజలు హ్యాండ్ ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం అయిన కెసీఆర్‌నే తెలంగాణా ప్రజలు నమ్మారు. ఈ విషయంలో తెలంగాణా ప్రజల వివేకాన్ని మాత్రం మెచ్చుకుని తీరాలి. మిగిలిన పార్టీలన్నీ కూడా ….ఎక్కడ కెసీఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని తెచ్చేస్తాడో? తెలంగాణాలో ఎక్కడ మేం వెనుకబడిపోతామో అని చెప్పి తెలంగాణాకు సపోర్ట్ చేసినవాళ్ళే. లేకపోతే ఇరు ప్రాంతాల్లోనూ రాజకీయంగా లాభపడాలనుకున్నవాళ్ళే. ఒక్క కెసీఆర్ మాత్రమే పూర్తిగా తెలంగాణాకు కట్టుబడ్డాడు. ఆ విషయాన్ని గుర్తించే తెలంగాణా ప్రజలు కూడా కెసీఆర్‌కి పట్టం కట్టారు. కానీ కెసీఆర్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ తెలంగాణాకు తిరుగులేని చక్రవర్తిలా ఫీలవుతున్నట్టున్నాడు. మామూలుగా కూడా నైజాం నవాబుల తరహా పాలనా శైలి, లైఫ్ స్టైల్ అంటే కెసీఆర్‌కి చాలా ఇష్టం. టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణం, కెసీఆర్ వ్యవహార శైలిని పరిశీలిస్తే ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణా రాజ్యానికి రాజులా ఫీలవుతున్నాడు కెసీఆర్.
విమర్శిస్తున్న మీడియా నోళ్ళు మూయించాడు. ఆ మీడియా అధినేతలకు కూడా ఆర్థిక లాభాలే చాలా ముఖ్యం కాబట్టి కెసీఆర్‌కి పూర్తిగా సరెండర్ అయిపోయారు. కార్యకర్తల బలం ఉన్న టిడిపిని ఓటుకు నోటు కేసును చూపించి సైలెంట్ చేసి పడేశాడు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి తన చిత్తానికి వచ్చినట్టుగా పనులు చేసుకుంటూ వెళుతున్నాడు కెసీఆర్. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ముందు క్షణం వరకూ కూడా సమైక్యాంధ్ర, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం లాంటి వాదనలను వినిపించిన వాళ్ళను టిఆర్ఎస్లో చేర్చుకుని పదవులు కట్టబెట్టాడు. ఉద్యమ చివరిదశలో రాజకీయ పార్టీలను, ప్రజలను ఒకే తాటిపై నడిపించిన కోదండరామ్‌ని మాత్రం తెలంగాణా ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. తన చర్యలను ప్రశ్నించిన వాళ్ళందరినీ….తాను తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాల గురించి చెప్తూ సైలెంట్ చేస్తున్నాడు కెసీఆర్. కెసీఆర్ చెప్తున్నట్టుగానే చెరువుల తవ్వకం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణంలాంటివి చాలా మంచి నిర్ణయాలే అయి ఉండొచ్చు. కానీ కెసీఆర్ చేస్తున్న తప్పుల విషయం ఏంటి? చక్రవర్తులు, రాజులు గుళ్ళు, గోపురాలకు దానాలు ఇచ్చినట్టుగా ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కూడా చేస్తానంటే ఎలా? కెసీఆర్ నమ్మకాల కోసం వేల కోట్ల రూపాయల తెలంగాణా ప్రజల సొమ్మును ఖర్చు చేస్తానని చెప్తే ఎలా? తనను విమర్శించిన వాళ్ళను పార్టీ నాయకులందరి చేతా పిచ్చి తిట్లు తిట్టించడం చంద్రబాబు స్టైల్. ఇప్పుడు కెసీఆర్ కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాడు. కల్వకుంట్ల కుటుంబాన్ని విమర్శించినవాళ్ళకు తెలంగాణా రాష్ట్రంలో స్థానం లేదు అనే రేంజ్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. నిరుద్యోగుల ఆందోళన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే టిఆర్ఎస్ నాయకులు అక్కడ ప్రత్యక్షమయ్యేవాళ్ళు. మా తెలంగాణా బిడ్డ అంటూ హరీష్‌రావు, కెసీఆర్‌లు ఆంధ్రాపాలకులపైన విమర్శలతో విరుచుకుపడేవాళ్ళు. మరి ఇప్పుడు అదే తెలంగాణా బిడ్డ ఆత్మహత్యాయత్నం చేస్తే కెసీఆర్ స్పందించడా? కోదండరామ్ విషయంలో ఇప్పటి తెలంగాణా పోలీసుల వైఖరికి, అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైఖరికి ఏమైనా వ్యత్యాసం ఉందా? టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరిచేతా కోదండరామ్‌ని తిట్టించాడు కెసీఆర్. కెసీఆర్ కూడా చాలానే విమర్శలు చేశాడు. కోదండరామ్‌ని తిట్టటానికి మీడియా ముందుకు వచ్చిన నాయకులకు…ఉస్మానియా విద్యార్థి ఆత్మహత్యాయత్నం గురించి మాట్లాడాలన్న స్పృహ లేకుండా పోయిందా? లేకపోతే ముఖ్యమంత్రి పదవి రాగానే ఉస్మానియా విద్యార్థుల త్యాగాలను మరిచిపోయారా?
ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన ఏ నాయకుడైనా ఎన్నో కొన్ని మంచి పనులు కచ్చితంగా చేస్తాడు. కెసీఆర్ కూడా అలానే చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకుల కంటే కొంచెం ఎక్కువ పనులు కూడా చేస్తున్నాడన్న మాట వాస్తవం. కానీ తెలంగాణా రాష్ట్రానికి తిరుగులేని చక్రవర్తిలా నిలబడిపోవాలన్న ఆశ కూడా కెసీఆర్‌కి చాలా ఎక్కువే ఉంది. కెసీఆర్‌కి అంతటి నమ్మకాన్ని, అధికారాన్ని ఇచ్చింది కూడా తెలంగాణా ప్రజలే. 2014 ఎన్నికల్లో సాధారణ మెజారిటీని మాత్రమే కెసీఆర్‌కి ఇచ్చిన తెలంగాణా ప్రజలు….ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఇతర పార్టీలకు అస్థిత్వం లేకుండా చేసిపడేశారు. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత నుంచి కెసీఆర్ కుటుంబం స్టైలే మారిపోయింది. తెలంగాణాలో మాకు తిరుగులేదన్న గట్టి నమ్మకం వచ్చేసింది. కానీ ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లాంటి పవర్ఫుల్ నాయకులను కూడా ఇంటిబాట పట్టించిన ఓటర్ల తీరు గురించి మాత్రం కెసీఆర్‌కి అవగాహన ఉన్నట్టుగా లేదు. మంత్రాలకు చింతకాయలు రాల్తాయని చెప్పి ప్రజలను నమ్మించే పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ…….విమర్శకులందరినీ తొక్కేస్తాం. ప్రత్యర్థులకు స్థానం లేకుండా చేస్తాం. తెలంగాణాను ఎప్పటికీ మేమే పరిపాలిస్తాం లాంటి భ్రమల్లో ఉంటూ ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే మాత్రం …..2014లో చాలా గొప్పగా ఆలోచించి పదవిని కట్టబెట్టిన అదే ఓటర్లు 2019లో ఇంటికి పంపించరన్న గ్యారెంటీ కూడా ఏమీ లేదు. ప్రజల ఓట్లతో ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రిని. ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రిని అన్న విషయం మరిచిపోయి కింగులా ఫీలయితే మాత్రం ఫలితం అలాగే ఉంటుందనడంలో సందేహం లేదు.