రైల్వేజోన్ పై ఇంత‌వ‌ర‌కూ ఏ క‌దలికా లేదా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు రైల్వేజోన్ త్వ‌ర‌లోనే ఇచ్చేయ‌బోతున్నామ‌నీ, దానిపై రైల్వేశాఖ అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని ఢిల్లీ పెద్ద‌లు ఈ మ‌ధ్య చెబుతున్నారు. భాజ‌పాపై టీడీపీ ఒత్తిడి పెంచుతున్న క్ర‌మంలో రైల్వే జోన్ పై కొంత క‌దిలిక వ‌చ్చిన‌ట్టే అనిపించింది. అయితే, విశాఖ జోన్ కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేద‌న్న వాస్త‌వం ఇప్పుడు మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది. కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శితో ఏపీ సీయ‌స్ దినేష్ కుమార్ ఢిల్లీలో భేటీ అయ్యారు. మొత్తంగా 17 అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. దీన్లో భాగంగా రైల్వే జోన్ ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. ప్రస్తుతం ఉన్న నివేదిక‌ల ప్ర‌కారం విశాఖ‌కు రైల్వే జోన్ ఇవ్వ‌డం క‌ష్ట‌మే అని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి తేల్చి చెప్పేశారు. ఈ త‌రుణంలో ఏపీ సీయ‌స్ వాగ్వాదానికి దిగార‌ట‌. అయితే, మ‌నం అధికారుల‌మ‌నీ, ఉన్న నివేదిక ఆధారంగానే నిర్ణ‌యాలు తీసుకోగ‌ల‌మ‌నీ, ఇలాంటి అంశాల‌పై రాజ‌కీయ నిర్ణ‌యం జ‌ర‌గాల్సి ఉంద‌నే అభిప్రాయాన్ని హోం శాఖ అధికారులు వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

అంటే, రైల్వే జోన్ పై మొద‌ట్నుంచీ ప‌లువురు కేంద్ర‌మంత్రులు చెప్పింది మొద‌లుకొని.. ఆదివారం నాడు ఏపీ భాజ‌పా అధ్య‌క్షుడు హ‌రిబాబు వ‌ర‌కూ చెప్పిందంతా క‌బుర్ల‌కే ప‌రిమిత‌మైంద‌ని అనుకోవాలి. జోన్ ఇస్తామ‌ని అంటున్నారే త‌ప్ప‌.. కార్య‌రూపంలో ఆ అంశాన్ని కిందిస్థాయి అధికారుల‌కు కేంద్రం నివేదించిన దాఖ‌లాలు లేవు. ఒడిశాతో మాట్లాడుతున్నామ‌నీ, త్వ‌ర‌లోనే ఒక ఆమోద‌యోగ్య‌మైన ప‌రిష్కారం వెల్ల‌డించ‌బోతున్నామ‌ని కూడా కేంద్రం ఇటీవలే చెప్పింది. అంతేకాదు, భువ‌నేశ్వ‌ర్‌, కిరండోల్ వంటి ప్రాంతాల‌ను విశాఖ జోన్ నుంచి మిన‌హాయించి.. ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల‌ను క‌లుపుతూ జోన్ ఏర్పాటు చేస్తే స‌మ‌స్య తీరిపోతుంద‌నే ప్ర‌తిపాద‌న కూడా బ‌లంగానే వినిపించింది. ఈ ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌తిపాద‌న‌లు కేవ‌లం మాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి అనే అనుమానం ఇప్పుడు క‌లుగుతోంది.

అంతేకాదు, టీడీపీ కేంద్ర మంత్రుల రాజీనామా త‌రువాత కేంద్రం మ‌రింత మొండివైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తోందేమో అనిపిస్తోంది. ప్రత్యేక హోదా లాంటివాటిపై సానుకూల నిర్ణయం లేకపోయినా.. కనీసం చిన్న‌చిన్న డిమాండ్ల‌ను కూడా పూర్తి చేయ‌కుండా ఆపేస్తారేమో అని భావన కూడా వ్య‌క్త‌మౌతోంది. అయితే, అధికారుల స్థాయిలో వ్య‌క్త‌మైన ఈ తాజా అభిప్రాయం ఫైన‌ల్ అన‌లేం. ఇప్ప‌టికైనా కేంద్రం త‌ల్చుకుంటే, ఏపీ ప్ర‌యోజ‌నాల ప‌ట్ల ఏమాత్రమైనా చిత్త‌శుద్ధి ఉంటే… రైల్వే జోన్ సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించ‌ండి అని హోంశాఖ అధికారుల‌కు ఆదేశాలు ఇవొచ్చు. కానీ, భాజ‌పా వైఖ‌రిలో అంత సానుకూలత ఎక్కడా కనిపించడం లేదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.