రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జాన్వీ కపూర్ కథానాయక. మార్చి 27న పెద్ది విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. ఈ వేసవికి ‘పెద్ది’ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అవ్వబోతుందని టాలీవుడ్ కూడా భారీ ఆశలు పెంచుకొంది. అయితే ఈలోగా ఓవార్త చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. ‘పెద్ది’ షూటింగ్ ఆలస్యం అవుతోందని, మార్చిలో రావడం కుదరదని, డిసెంబరుకు షిఫ్ట్ అయ్యే ఛాన్సుందన్నది ఆ వార్తల సారాంశం. దాంతో మెగా ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. ‘పెద్ది’ లాంటి సినిమాలకు వేసవి మంచి సీజన్. దాన్ని క్యాష్ చేసుకోకుండా డిసెంబరుకు వెళ్లిపోవడం ఏమిటని బెంగ పెట్టుకొన్నారు.
అయితే ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పనిలేదు. ఈ సినిమా అనుకొన్న సమయానికే వస్తుంది. అందుకోసం దర్శక నిర్మాతలు అహర్నిశలూ కష్టపడుతున్నారు. ఈనెలాఖరుకు దాదాపు షూటింగ్ పూర్తవ్వబోతోందని టాక్. మహా అయితే ఫిబ్రవరిలో మరో వారం రోజుల షూటింగ్ ఉండొచ్చు. ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైపోతాయి. అనుకొన్న సమయానికే పెద్దని విడుదల చేయడానికి మైత్రీ కంకణం కట్టుకొంది. అందుకే రాత్రీ, పగలూ తేడా లేకుండా ‘పెద్ది’ పనులు చక చక జరిగిపోతున్నాయి. సంక్రాంతికి ‘పెద్ది’ నుంచి ఓ పాట వచ్చే ఛాన్సుంది. ఆ తరవాత ప్రమోషన్లు జోరందుకొంటాయి. సో.. ‘పెద్ది’ వాయిదా కేవలం రూమర్ మాత్రమే అనుకోవాలి.
