పాపం శిరీష్‌… అలా వ‌దిలేశారేంట‌య్యా!?

మెగా హీరో నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే హ‌డావుడి మామూలుగా ఉండ‌దు. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ లాంటి వాళ్లు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ల‌లో మెరుస్తారు. ‘ఈ సినిమాలో మావోడు చించేశాడు. పొడి చేశాడు.. ఆ రోజుల్లో నేను చేసిన ఖైదీ గుర్తొచ్చింది’ అంటూ చిరంజీవి ఓ బైట్ అయినా ఇస్తారు. ట్వీట్లు మామూలే. కానీ… అల్లు శిరీష్‌కి మాత్రం ఇలాంటి హంగామా ఏం క‌ల‌సి రాలేదు. త‌న సినిమా ‘ఏబీసీడీ’ ఎలాంటి హ‌డావుడీ లేకుండా విడుద‌లైపోయింది. సినిమా విడుద‌ల‌కు ముందు ఒక్క మెగా హీరో కూడా ట్వీట్ చేయ‌లేదు. ‘ఆల్ ది బెస్ట్’ అని కూడా చెప్ప‌లేదు. గ‌ప్ చుప్‌గా వ‌చ్చేసింది. అంతే నిశ్శ‌బ్దంగా వెళ్లిపోయేలానూ ఉంది.

మెగా హీరోలు ట్వీట్లు చేస్తేనో, ప్రీ రిలీజ్ వేడుక‌ల్లో మాట్లాడితేనో సినిమాకి హైప్ వ‌చ్చేస్తుంద‌నుకోవ‌డం పొర‌పాటే. కాక‌పోతే… కాస్త‌యినా బ‌జ్ వ‌చ్చే ఛాన్సుంది. న‌లుగురూ ఆ సినిమా గురించి మాట్లాడుకునే అవ‌కాశం ఉంటుంది. ఫ్రీ ప‌బ్లిసిటీ అన్న‌మాట‌. దాని వ‌ల్ల‌.. క‌నీసం ఓపెనింగ్స్ అయినా వ‌స్తాయి. ఇప్పుడు ‘ఏబీసీడీ’కి అదే లేదు. థియేట‌ర్ల‌న్నీ ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అస‌లు ఈ సినిమా వ‌స్తోంద‌న్న హింటు బ‌లంగా వెళ్ల‌లేక‌పోయింది.

అయితే.. ముందు నుంచీ శిరీష్ సినిమాల‌కు ఈ త‌ర‌హా ప‌బ్లిసిటీ దొర‌క‌డం లేదు. కావాల‌ని ప‌బ్లిసిటీకి దూరంగా ఉంటున్నాడో, లేదంటే… ‘నా సినిమాకి ఎంత ప‌బ్లిసిటీ ఇచ్చినా ఇంతే క‌దా’ అనుకుంటున్నాడో తెలీదు గానీ, దాని వ‌ల్ల వ‌సూళ్ల‌పై ప్ర‌భావం ప‌డుతోంది. ఈ త‌ర‌హా ఓపెనింగ్స్ ఏ హీరో కోరుకోడు. జ‌నాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించుకోగ‌లిగే ద‌మ్మున్నా, మెగా హీరోల అండ ఉన్నా – శిరీష్ ఉప‌యోగించుకోవ‌డం లేదు. అదెందుకో… త‌న‌కే తెలియాలి మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com