ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ‘రాజాసాబ్’ ఒకటి. పండగ హడావుడి ‘రాజాసాబ్’తోనే మొదలవుతుంది. శనివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా సాగింది. ప్రభాస్ స్పీచ్ కూడా అందర్నీ ఆకట్టుకొంది. అయితే.. ఇక మీదట ‘రాజాసాబ్’ ప్రమోషన్లలో ప్రభాస్ కనిపించే అవకాశం లేదు. రాజాసాబ్ కు సంబంధించి విడుదలకు ముందు ఇంకొన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. వాటిలో ప్రభాస్ ఉండకపోవొచ్చు. ఎందుకంటే డిసెంబరు 31న ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోతున్నాడు. సినిమా విడుదల సమయంలో ప్రభాస్ ఇక్కడ ఉండడు. పండగ అయిన తరవాత.. ప్రభాస్ మళ్లీ తిరిగి వస్తాడు. అప్పటి నుంచి ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ రెగ్యులర్ షూటింగుల్లో పాలు పంచుకొంటాడు. ఈలోగా ‘రాజాసాబ్` ప్రమోషన్లు ఏం చేసినా మారుతి అండ్ టీమ్ చూసుకోవాల్సిందే.
అయితే ఈమధ్యలో ప్రభాస్ తో ఓ సెపరేట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా లతో ఓ చిట్ చాట్ చేసి, దాన్ని రాజాసాబ్ ప్రమోషనల్ కంటెంట్ గా విడుదల చేసే అవకాశం ఉంది. స్పిరిట్ కోసం వీరిద్దరూ జట్టు కట్టిన సంగతి తెలిసిందే. సందీప్ మంచి మాటకారి కూడా. ప్రభాస్ తో సందీప్ చేసే చిట్ చాట్ కచ్చితంగా రాజాసాబ్ ప్రమోషన్లకు ఉపయోగపడుతుంది. ప్రభాస్ కూడా ప్రమోషన్లలో పెద్దగా కనిపించే రకం కాదు. మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు కూడా బహు తక్కువ. కాబట్టి అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు ట్యూన్ అవుతుంటారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరవాత, ఓ కామన్ ఇంటర్వ్యూ ఇచ్చి పక్కకు తప్పుకోవడం ప్రభాస్ అలవాటు. సో.. ఈసారీ అదే జరుగుతోంది. కాకపోతే ఈ ఇంటర్వ్యూ చేసేది సందీప్ రెడ్డి వంగా కాబట్టి కాస్త స్పెషల్ గా ఉండొచ్చు.
