సుప్రీంకోర్టు గడువు మేరకు తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైనా అనర్హతా పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిష్కరించారు. పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మందిపై ఇప్పటికే పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని పిటిషన్లు కొట్టివేశారు. చివరిగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలపైనా పిటిషన్లు కొట్టివేశారు. తాము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేయలేదని వారు వాదించారు. టెక్నికల్ గా వారి వాదనలో నిజాయితీ ఉందని స్పీకర్ నిర్దారించారు. ఆమేరకు వారిపైనా అనర్హతా పిటిషన్లు కొట్టివేశారు.
కడియం శ్రీహరి కుమార్తె ఎంపీగా ఉన్నారు. ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయలేదు కాబట్టి ఇతరులకు ఇచ్చిన వెసులుబాటు తరహాలోనే ఆయనకూ మినహాయింపు లభించింది అనుకున్నా.. దానం నాగేందర్ అంశం మాత్రం కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని అనుకోవచ్చు. ఆయన నేరుగా కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు. అయినా ఆయన పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు చెప్పారు. అంటే భవిష్యత్ లో ఇదో కొత్త సంప్రదాయం అయ్యే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టులో గురువారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరగనుంది. అందుకే ఇవాళ తీర్పు చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పూర్తిగా..స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపైనే. ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న అంశంపై కాదు. దీంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్ట ప్రకారం ఉందా లేదా అన్నది తేల్చడానికి మరోసారి బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.
