ఏపీలో మోడీకి “అతిథి మర్యాద”ల స్వాగతం లేనట్లే..!

జనవరి ఆరో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. ఎప్పుడో అమరావతి శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చి వెళ్లిన తర్వాత మళ్లీ ఇదే అమరావతి వైపు రావడం. మామలుగా అయితే… ప్రధానమంత్రి వస్తున్నారంటే.. దానికి ప్రోటోకాల్ ఉంటుంది. అంటే అధికార మర్యాదల వ్యవహారం అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఏదైనా రాష్ట్రానికి ప్రధానమంత్రి వెళ్తే… ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గౌరవ స్వాగతం పలుకుతారు. కానీ.. ఏపీకి వచ్చే ప్రధానమంత్రికి.. స్వాగతం చెప్పడానికి ముఖ్యమంత్రి సిద్దంగా లేరు. వెళ్లకూడడని నిర్ణయించుకున్నారు. వెళ్లే అవకాశం కూడా లేదు.

ప్రధాని హోదాలో మోడీ వస్తున్నారు కాబట్టి.. ప్రోటోకాల్ సంగతేమిటన్నదానిపై… మంత్రులతోనూ.. సీనియర్ అధికారులతోనే చంద్రబాబు చర్చలు జరిపారు. ప్రధాని అధికారిక పర్యటనల కోసం వచ్చినప్పుడు మాత్రమే ప్రోటోకాల్ ఉంటుందని… వ్యక్తిగత, రాజకీయ పర్యటనకు వచ్చినప్పుడు.. ఆయనకు అధికారిక మర్యాదల ప్రకారం స్వాగతం చెప్పాల్సిన పని లేదని…అధికారులు, మంత్రులు.. సీఎం క్లారిటీ ఇచ్చారు. మోడీ వస్తోంది.. గుంటూరులో బీజేపీ తరపున ఓ సభలో ప్రసంగించడానికి.. అంతే తప్ప.. మరెలాంటి అధికారిక కార్యక్రమమూ పెట్టుకోలేదు. కేంద్రం తరపున శంకుస్థాపన చేయాల్సినది కానీ.. ప్రారంభించాల్సిన పథకం కానీ ఏదీ లేకపోవడంతో.. ఆయన పర్యటన పూర్తిగా రాజకీయంగా సాగనుంది. రెడు రోజుల కిందట ఆయన ఒడిషా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఐఐటీని ప్రారంభించారు. అప్పుడు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో ఆయన డయాస్ షేర్ చేసుకున్నారు. అలాంటిదేమీ ఏపీలో లేకపోవడంతో… మోడీ టూర్ పూర్తిగా.. రాజకీయ పరంగా సాగనుంది.

కేవలం రాజకీయం కోసమే..మోడీ వస్తున్నారని.. ఆ కారణంగానే ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని.. చంద్రబాబు నిర్ణయించుకున్నారు. టీడీపీ నేతలతో ఉదయం జరిగిన టెలికాన్ఫరెన్స్ లోనూ.. ప్రముఖంగా ఇదే విషయాన్ని చెప్పారు. కేవలం రాజకీయం కోసమో మోడీ వస్తున్నారని గుర్తు చేశారు. అంటే.. ఆయన స్వాగతం లేనట్లేనని చెప్పుకోవచ్చు., అదే సమయంలో… ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా చంద్రబాబు నిరసనలకు పిలుపునిచ్చారు. తానే పిలుపునిచ్చి.. తానే స్వాగతం పలికడం ఏ మాత్రం బాగుండదన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. కొసమెరుపేమిటంటే… గవర్నర్ నరసింహన్ మాత్రం.. ప్రధాని గన్నవరం విమానాశ్రయంలో దిగడానికి రెండు గంటల ముందే.. ఎయిర్ పోర్టుకు వచ్చి..స్వాగతం చెప్పడానికి రెడీ అవుతారు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.