రాజకీయాలు పక్కన పెడితే కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె. ఆమెకు కష్టం వస్తే.. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా అయినా బీఆర్ఎస్ నేతలు, కుటుంబసభ్యులు మద్దతుగా నిలబడేందుకు అందరూ ముందుకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు. కానీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచితమైన వ్యాఖ్యల విషయంలో అలాంటి సపోర్టు కవితకు లభించలేదు. అవి ఆమె వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా ఉన్నాయి. ఇంటి ఆడపడుచుపై అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఆమెకు మద్దతుగా ఉండాలి. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
కవిత రాజకీయంగా కేటీఆర్ తో విబేధిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆయనది మాత్రమే కాదని తనది కూడా అని ఆమె చెబుతున్నారు. పార్టీ వ్యవహారాల్లో సరైన పాత్ర లేదని జాగృతి పేరుతో రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ బహిరంగంగా ఎప్పుడూ ఆమె బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయలేదు. కేసీఆర్ తమ నాయకుడు అనే అంటున్నారు. కానీ ఆమె ప్రత్యేకమైన దారిలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడంతో ఆమెను దూరం పెట్టారు. ఆమె గురించి పట్టించుకోవడంలేదని లేదు. రాజకీయంగా అది వారి వ్యూహం కావొచ్చు కానీ.. వ్యక్తిగతంగా సమస్య వచ్చినప్పుడు మాత్రం కుటుంబపరంగా అయినా మద్దతుగా ఉండకపోతే చెడ్డపేరు తీసుకు వస్తుంది.
తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కవితను బాధపెట్టాయి. ఆ వ్యాఖ్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మోటు సామెతల్ని తీసుకువచ్చి రాజకీయాల్లో అన్వయిస్తే ఘోరమైన అర్థాలు వస్తాయి. తన మాటల్ని తీన్మార్ మల్లన్న సమర్థించుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ముదురుతుంది. కవితకు ఎంత మద్దతు లభిస్తే అంత ధైర్యంగా ఉంటారు. కానీ కవితకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవయింది. ఇప్పుడు కవితకు.. తనకు మద్దతు ఎవరు.. ఎవరు కాదు అన్నదానిపై ఓ స్పష్టత వచ్చి ఉంటుంది. కానీ కుటుంబ పరమైన బంధాలు కూడా ప్రస్తుత పరిణామాల వల్ల ప్రభావితం అయ్యే ప్రమాదం ఉంది.
కవిత సొంత రాజకీయాలు చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక తనకు ఎలాంటి మద్దతు రాదు అని ఒంటరి పోరాటం చేయాల్సిందేనని ఫిక్సయి ఉంటే.. ప్రస్తుత పరిణామాలపై ఆమె పెద్దగా ఆశ్చర్యపోరు. కానీ వ్యక్తిగత దాడి జరిగినప్పుడు కూడా కుటుంబసభ్యులు మద్దతు తెలియచేయలేదని ఫీలయితే మాత్రం కవిత రాజకీయాలు కొత్త దారిలోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.