ఏపీ ప్రభుత్వం ఇంకా పునాదుల దశలో ఉన్న పది మెడికల్ కాలేజీలను పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్లో మార్చాలనుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఇది పెద్ద అవినీతి అంటూ అడ్డగోలు రాజకీయం చేశారు. తాను వస్తే పెట్టుబడిదారుల్ని జైల్లో పెడతానని ఆయన హెచ్చరించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చట్టం, న్యాయం ఎలా చచ్చుబడిపోయాయో అందరూ చూశారు. అందుకే భయపడ్డారో.. ఆ కాలేజీల కోసం శక్తిని ధారబోస్తే ప్రయోజనం ఉండదని రూల్స్ ను చూసి అనుకున్నారో కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి అటు వ్రతం చెడింది.. ఇటు ఫలితం దక్కని అనుభవం ఎదురవుతోంది.
అత్యుత్తమ వైద్య విద్య కోసం ప్రైవేటు సహకారం తప్పనిసరి !
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్ పది మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు చేసి టెండర్లు పిలిచి.. కొద్ది పనులు చేసిన వారికి డబ్బులు ఎగ్గొట్టి ఓడిపోయారు. ఆ కాంట్రాక్టర్లు ఎక్కడివక్కడ పనులు ఆపేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీకి వాటిని వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలనుకుంది. కేవలం బిల్డింగులు పూర్తి చేయడం అయితే సమస్య ఉండదు. కానీ నిర్వహణ కూడా చేపట్టి అత్యున్నత స్థాయి వైద్య విద్యను అందించాల్సి ఉంది. అందుకే నిపుణులైన ప్రైవేటు సంస్థల సహకారాన్ని కోరుకుంది.
పీపీపీ విధానానికే అన్ని విభాగాల మద్దతు !
మెడికల్ కాలేజీ నిర్మించడం సమస్య కాదు. కేవలం క్లాసు రూములు ఉంటే డాక్టర్లు బయటకు రారు. మంచి బోధనా సిబ్బంది, విద్యార్థులు నేర్చుకోవడానికి తగ్గ ఇన్ ఫ్రా ఉండాలి. అవి నిరంతరం ఖర్చుతో కూడుకున్నవి. అలాంటివి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలంటే. ప్రైవేటు రంగం సహకారం తప్పనిసరి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటు సహకారంతో.. పీపీపీ విధానంలో చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. అలా చేస్తే తాము నలభై శాతం సబ్సిడీ ఇస్తామని కూడా చెబుతోంది. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా అదే సిఫారసు చేసింది.
అవినీతి పేరుతో బెదిరింపులకు దిగుతున్న జగన్
జగన్మోహన్ రెడ్డికి పేదల వైద్యం పట్ల పట్టింపు లేదు. పీపీపీ అంటే ప్రైవేటు అని చెప్పి ప్రచారం చేసి.. ఇన్వెస్టర్లను బెదిరిస్తే.. కాలేజీలు ఆగిపోతాయి. దాని వల్ల ఆయనకు రాజకీయంగా లాభం వస్తుందో రాదో తెలియదు కానీ ప్రజలకూ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు ఒక్క మెడికల్ కాలేజీకి టెండర్ రాలేదు. దానికి ఆయన సంతోషంగా ఉండి ఉంటారు. ఎందుకంటే తన. బెదిరింపులు ఫలించాయని ఆయన అనుకుంటూ ఉండవచ్చు.
ప్రభుత్వానికి రెండు వైపులా నష్టం
ఓ వైపు ఇన్వెస్టర్లకు భరోసా ఇవ్వకపోవేరడవం, మరో వైపు పీపీపీ విధానంలో అవినీతి అని జగన్ వైపు నుంచి నిందలు వస్తున్నా..కాలేజీలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ప్రభుత్వానికి రెండు వైపులా నష్టం కలుగుచేసేదే. నిందలు పడినా.. కనీసం ఆ కాలేజీలను టెండర్లలో పీపీపీ మోడల్ లో నిర్వహించేందుకు దక్కించుకుని వేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తారని సీఎం ఆశిస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు టెండర్ల నిబంధనలు సవరించి మళ్లీ టెండర్లు పిలుస్తారు. అప్పుడైనా దిగ్గజ సంస్థలు వస్తే ప్రభుత్వానికి కాస్త డ్యామేజీ తగ్గుతుంది. లేకపోతే రెండు వైపులా ప్రభుత్వం నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది.
