శశిధర్ రెడ్డి పోరాటానికి కాంగ్రెస్ లో గుర్తింపులేదా..?

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి! మూడో జాబితాలో కూడా ఆయ‌న పేరు లేదు. అంటే, ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కి టిక్కెట్లు లేన‌ట్టే. దీనిపై ఆయ‌న ఘాటుగా స్పందించారు. మూడో జాబితాలో కూడా త‌న పేరు లేక‌పోవ‌డం బాధాక‌రం అన్నారు. ఈ సంద‌ర్భంగా టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై కూడా ఆయ‌న మండిప‌డ్డారు. తాను గెలిచే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయంటూ స్క్రీనింగ్ క‌మిటీ ముందు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చెప్పిన‌ట్టు తెలిసింద‌న్నారు. స్క్రీనింగ్ క‌మిటీతోపాటు, పార్టీ హై క‌మాండ్ ను కూడా ఉత్త‌మ్ త‌ప్పుతోవ ప‌ట్టించార‌న్నారు. సీనియ‌ర్ నేత‌కు సీటు ఇవ్వ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. తాజాగా ఓ స‌ర్వేలో త‌న‌కు 60 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని తేలింద‌నీ, సీట్ల కేటాయింపుల్లో అవ‌క‌త‌వ‌క‌లు చాలా ఉన్నాయంటూ కూడా ఆరోపించారు.

సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే అవ‌కాశ‌మే లేద‌న్నారు. స‌న‌త్ న‌గ‌ర్ సీటు తెలుగుదేశం పార్టీ అడుగుతోంద‌ని కుంతియా త‌న‌కు ముందే చెప్పార‌న్నారు. అయితే, ఆ సీటుపై త‌మ‌కు కావాలంటూ టీడీపీ అడ‌గ‌లేద‌నీ, ఆ విష‌యాన్ని ఆ పార్టీకి చెందిన‌వారే స్వయంగా చెప్పార‌ని శ‌శిధ‌ర్ రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం. కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యానికి వ‌స్తాన‌ని ఆయ‌న చెప్పారు. త‌న సీటు విష‌య‌మై పునః ప‌రిశీలించాలంటూ ఇప్ప‌టికే ఆయ‌న హైక‌మాండ్ ను కోరినట్టుగా స‌మాచారం. అంతేకాదు, త‌న‌కు ప్ర‌త్యామ్నాయ మార్గాలున్నాయ‌నీ, అవేంట‌నేవి త్వ‌ర‌లోనే ఒక నిర్ణ‌యం తీసుకుంటాన‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించ‌డం విశేషం!

ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచీ… ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లున్నాయంటూ, వాటిని స‌రిచేయ‌డానికి స‌మ‌యం ఇవ్వ‌కుండా ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తారంటూ ఆయ‌న న్యాయ‌పోరాటం కూడా చేశారు. ఒక దశ‌లో ఇదే పాయింట్ మీద ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌తాయా, కేసీఆర్ అనుకున్నట్టు ఎన్నికల షెడ్యూల్ ఉండదేమో అనే అభిప్రాయం కూడా నెల‌కొంది. కాంగ్రెస్ పార్టీతోపాటు, ఇత‌ర పార్టీలు కూడా శశిధ‌ర్ పోరాటంపై కొంత ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చాయి. ఏదైతేనేం, సీనియ‌ర్ నేత‌కు ఇప్పుడు సీటు లేని ప‌రిస్థితి ఎదురైంది. శ‌శిధ‌ర్ రెడ్డి లాంటి సీనియ‌ర్ కి సీటు ద‌క్క‌ని ప‌రిస్థితి ఉంటుందీ అనుకుంటే… హైక‌మాండే ముందు నుంచీ డీల్ చెయ్యాల్సింది. కొన్ని నెల‌ల ముందే ఆయ‌నతో మాట్లాడి ఉంటే.. ఈరోజు ఇలా అసంతృప్తి బ‌య‌ట‌ప‌డే ప‌రిస్థితి ఉండేది కాదు. ప్ర‌త్నామ్నాయ మార్గాల‌ను ముందుగానే పార్టీ చూపించి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది క‌దా! తాజా ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన న్యాయ పోరాటానికి కూడా గుర్తింపు దక్కలేదా అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com