లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు నాడు ఎక్సైజ్ శాఖను చూసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి నోటీసులు జారీ చేశారు. శనివారం ఆయన సిట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకూ ఆయన పేరు వినిపించలేదు. ఇప్పుడు కూడా ఆయనకేం సంబంధంలేదు. కేవలం సాక్షిగానే పిలుస్తున్నారు. ఎందుకంటే ఎక్సైజ్ మంత్రి ఆయనే ఆయనా .. జగన్ రెడ్డి ఆయన గ్యాంగ్ .. నారాయణస్వామికి చిన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వలేదు.
ఎప్పుడైనా వివాదాలు వచ్చినా ప్రెస్మీట్లు పెట్టే చాన్స్ కూడా ఉండేది కాదు. అసలు ఆయన పేషీలో అధికారులు ఎవరున్నారో కూడా నారాయణస్వామికి తెలియదు. చివరికి ఇంత పెద్ద స్కాం జరిగితే అందులో ఆయనకు పిసరంత కమిషన్ కూడా ఇవ్వలేదు. ఆయనకు ఏ రూపంలో అయినా కాస్తంత డబ్బులు ఇచ్చారని సిట్ అధికారులకు ఆధారాలు లభించలేదు. మిథున్ రెడ్డి ప్రతి నెలా ఐదు కోట్లు తీసుకున్నట్లుగా చెబుతున్నారు కానీ.. పది పైసలు కూడా నారాయణస్వామికి అందాయన్నదానికి ఆధారాలు లభించలేదు.
జగన్ మంత్రివర్గంలో మంత్రులకు ఎలాంటి బాధ్యతలు ఉండేవి కావు. సకల శాఖల మంత్రిగా సజ్జల పనులు చక్కబెట్టేవారు. ఆయా శాఖల మంత్రులు కూడా తమ శాఖల గురించి మాట్లాడేవాళ్లు కాదు. సజ్జల ఆఫీసు నుంచి వచ్చే ప్రెస్ నోట్లు ఎవరికి వస్తే వారు మాట్లాడేవాళ్లు. పౌరసరఫరాల గురించి పేర్ని నాని.. హోంశాఖ గురించి కొడాలి నాని.. విద్యాశాఖ గురించి రోజా .. ఇలా ఎవరికీ సంబంధం లేని శాఖల గురించి మాట్లాడేవారు. లక్కీగా తన శాఖలో జగన్ చేసిన అతిపెద్ద స్కాంలో నారాయణ స్వామి ఇరుక్కుకోకపోవడం ఆయన అదృష్టం అనుకోవచ్చు. జగన్ నిర్వాకాలకు గౌరవంగా బతికిన వాళ్లంతా జైళ్లకు పోతున్నారు.