సూపర్ స్టార్ మహేష్‌బాబును సాయి సూర్య డెవలపర్స్‌తో చేసుకున్న ఒప్పందం, ప్రచారం వెంటాడుతోంది. ప్రచార కర్తగా వ్యవహరించడంతో అటు ఈడీ సమస్యలు.. ఇటు వినియోగదారుల కోర్టుల సమస్యలూ వస్తున్నాయి. తాజాగా మహేష్ బాబుకు వినియోగదారుల కోర్టు సమన్లు జారీ చేసింది. మహేష్ బాబు ప్రకటనలు చూసే తాను ప్లాట్ బుక్ చేసుకున్నానని కానీ తనను మోసం చేశారని వినియోగదారుల కమిషన్ లో ఓ వ్యక్తి కేసు వేశాడు. ఈ కేసులో ఏ 3గా మహేష్ బాబును చేర్చి నోటీసులు జారీ చేశారు.
ఇప్పటికే సాయి సూర్య డెవలపర్స్ పై ఈడీ దాడులు చేసింది. ఈ వ్యవహారంలో మహేష్ బాబుకు ఇచ్చిన రెమ్యూనరేషన్ లెక్కల్లో తేడాగా రాసుకోవడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. మహేష్ బాబుకు రూ. మూడు కోట్లు నగదు రూపంలో ఇచ్చినట్లుగా కంపెనీ అకౌంట్ బుక్స్ లో ఉంది. దీనిపై ఈడీ మహేష్ బాబును ఆరా తీసింది. గతంలో రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. మహేష్ బాబు నేరుగా హాజరయ్యారా లేకపోతే.. తన లాయర్ ద్వారా సమాచారం పంపారా అన్నది స్పష్టత లేదు. ఇప్పుడు వినియోగదారుల ఫోరం కేసు నమోదు అయింది.
నిజానికి ప్రచారకర్తలకు ఎలాంటి బాధ్యత ఉండదు. అన్ని అంశాలను చూసుకుని కొనాల్సింది వినియోగదారులే. కేవలం వారు ప్రచారం చేస్తారు. వారు చెప్పారని మాత్రమే తాము కొనుగోలు చేశామనే వాదనలో అర్థం ఉండదు. ఒప్పంద పత్రాల్లో కూడా అలా ఉండదు. కానీ సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలని.. మోసపూరిత సంస్థలకు ప్రచారం చేయకూడదని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు పలుమార్లు సూచించాయి.