ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో మరోసారి కదలిక వచ్చింది. సీఐడీ చీఫ్గా పని చేసిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ నాలుగో తేదీన ఆయన గుంటూరులోని సిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని ఆదేశించారు. చాలా కాలంగా ఈ కేసులో పురోగతి లేదు. హఠాత్తుగా సునీల్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు.
జగన్ సీఎం అయ్యాక పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ అయ్యారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతలపై చేయని అరాచకం లేదు. రఘురామపై లేనిపోని కేసులు పెట్టి ఓ పుట్టిన రోజున ఆయన హైదరాబాద్ లో ఉంటే అరెస్టు చేసి తీసుకెళ్లారు. కనీసం విచారణకు రావాలని నోటీసులు కూడా ఇవ్వలేదు. మీడియాలో మాట్లాడుతున్నారని దేశద్రోహం కేసు పెట్టారు. గుంటూరు సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్లి రాత్రంతా కొట్టారు. తర్వాత రోజు ఈ విషయాన్ని కోర్టులో రఘురామ బయట పెట్టారు. వైద్య పరీక్షల్లో అసలు విషయం బయటపడకుండా.. గుంటూరు వైద్యులతో తప్పుడు నివేదికలు ఇచ్చారు. తర్వాత సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తే దాడి చేసినట్లుగా రిపోర్టు వచ్చింది.
తనపై దాడికి పీవీ సునీల్ కుమారే కుట్ర చేశారని అప్పటి సీఎంకు తనను కొడుతూ లైవ్ లో చూపించారని రఘురామ ఆరోపించారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ప్రభుత్వం మారగానే ఆయన గుంటూరు ఎస్పీకి విచారణ చేయించాలని లేఖ రాశారు. దాంతో కేసు నమోదు చేశారు. ప్రత్యేక సిట్ ను నియమించారు. కొంత మందిని అరెస్టు చేశారు కానీ.. సునీల్ కుమార్కు ఇప్పటి వరకూ నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆయనకు నోటీసులు జారీచేశారు. ఆయనను అరెస్టు చేస్తారా లేదా అన్నది విచారణకు హాజరయిన రోజు స్పష్టత వస్తుంది. ప్రస్తుతం సునీల్ కుమార్ సస్పెన్షన్ లో ఉన్నారు.