ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. నిజానిక చేసిన నేరాలు, పోగేసిన సంపద, పర్యావరణానికి చేసిన నష్టంతో పోలిస్తే ఇలా చాలా చిన్న శిక్ష. అయినా భారీతయ చట్టాల ప్రకారం ఆయనకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇప్పుడు అందరి చూపు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై పడింది. గాలి జనార్దన్ రెడ్డి.. జగన్ రెడ్డిని తన సోదరుడిగా చెప్పుకుంటారు. వైఎస్ ను తండ్రిగా భావిస్తారు. అయితే ఈ ఓబులాపురం కేసులు నమోదైన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని ఓ సారి జగన్ అన్నారు.
అయితే ఇద్దరి బాంధవ్యం గురించి.. అందరికీ తెలుసు. జగన్ తో పాటు కర్ణాటకలో గాలి బ్రదర్స్ యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని పెట్టారు. తేడా వస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేసి.. .బళ్లారిని కూడా కలిపి సొంత రాష్ట్రంగా ఏర్పాటు చేయించి రాజ్యం ఏలాలని ప్లాన్ చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తర్వాత గాలి జనార్దన్ రెడ్డి తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. మళ్లీ పార్టీ పెట్టారు. మళ్లీ విలీనం చేశారు. ఇప్పుడు జగన్ ఆప్తుడి కేసులు తేలాయి. ఇక జగన్ కేసులు ఎప్పుడు అన్న చర్చ ప్రారంభమయింది.
అక్రమాస్తుల కేసుల్లో జగన్ ను అరెస్టు చేసినప్పుడే.. ఓబుళాపురం కేసుల్లో గాలి జనార్ధన్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అత్యంత క్లిష్టమైన కేసును సీబీఐ నిరూపించింది. ఇప్పుడు అన్నీ కళ్ల ముందే జగన్ అక్రమాస్తుల కేసుల్ని నిరూపించడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఆ కేసులో ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు చూస్తే.. జగన్ కానీ సహ నిందితులు కానీ బయటపడతారని ఎవరూ అనుకోరు. కానీ వివిధ రకాల పిటిషన్లు వేసి జగన్ అండ్ కో విచారణను ఆలస్యం చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు .. హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ కేసుల విచారణ ఊపందుకునే అవకాశం ఉంది.