హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రవాస భారతీయుల పెట్టుబడులు నగర ప్రాపర్టీ మార్కెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, హైదరాబాద్‌లో జరుగుతున్న మొత్తం రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఎన్ఆర్ఐల వాటా ఏకంగా 20 శాతానికి చేరుకుంది. గతంలో కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వారు, ఇప్పుడు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను చూసి, సొంత ఇల్లు లేదా విల్లా కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న కోకాపేట్, మోకిల, శంకర్ పల్లి, తెల్లాపూర్ వంటి ప్రాంతాలు ఇప్పుడు లగ్జరీ విల్లాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఈ ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీ విల్లాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డు కు సమీపంలో ఉండటం, విమానాశ్రయానికి వేగంగా చేరుకునే సౌకర్యం ఉండటంతో ఎన్ఆర్ఐలు ఈ ప్రాంతాలను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు. ఇక్కడ నిర్మితమవుతున్న విల్లాలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉంటున్నాయి.
హైదరాబాద్ లగ్జరీ మార్కెట్ ఇప్పుడు ముంబై, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడుతోంది. నగర శివార్లలోని ప్రీమియం ప్రాజెక్టులలో విల్లా ధరలు రూ.5 కోట్ల నుండి ప్రారంభమై రూ.25 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఇంత భారీ ధర ఉన్నప్పటికీ, అమెరికా, యూకే, కెనడా , గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన భారతీయులు వీటిని కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. కేవలం నివాసం కోసమే కాకుండా, భవిష్యత్తులో ఈ ఆస్తుల విలువ మరింత పెరుగుతుందనే నమ్మకం పెట్టుబడిదారుల్లో బలంగా ఉంది.
ఎన్ఆర్ఐల ఆసక్తికి ప్రధాన కారణం రూపాయి విలువలో హెచ్చుతగ్గులు ,హైదరాబాద్‌లో పెరుగుతున్న అద్దె ఆదాయం. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం ఎన్ఆర్ఐలకు కలిసి వస్తోంది, తద్వారా వారు తక్కువ విదేశీ కరెన్సీతో భారత్‌లో ఎక్కువ విలువైన ఆస్తులను సొంతం చేసుకోగలుగుతున్నారు. దీనికి తోడు, రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడం, నియోపోలిస్ వంటి అత్యాధునిక లేఅవుట్లు రావడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ వాల్యూను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది.


